కరకట్టల కటకట.. | - | Sakshi
Sakshi News home page

కరకట్టల కటకట..

Apr 28 2026 7:35 AM | Updated on Apr 28 2026 7:35 AM

చీరాల అర్బన్‌: వ్యవసాయం అంటేనే సీఎం చంద్రబాబుకు గిట్టదు. ఆయన పూర్వ కాలపు పరిపాలనలో ఇలాంటి ఉదాహరణలు ఎన్నో. మాగాణిలో వరి పండించే వారు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలి. మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు మారాలి. ఇలాంటి ఉచిత సలహాలు బాగానే ఇస్తారు. అయితే రైతు ప్రయోజనాలకు ప్రత్యేక నిధుల కేటాయింపు అంటే మాత్రం స్పందించరు. కొమ్మమూరు కాలువ శాశ్వత మరమ్మతులకు ప్రత్యేక నిధులు కేటాయించక పోవటం అందుకు దర్పణం పడుతోంది. కొమ్మమూరు ఆయకట్టుకు జిల్లా ధాన్యాగారంగా పేరు. ఒకప్పుడు ఏడాదికి రెండు పంటలు పండించేవారు. ఇప్పుడు ఆ ఆయకట్టు తీసికట్టుగా తయారైంది. ప్రతి ఏడాది తుపాన్లు, వర్షాలు, వరదల సమయంలో కొమ్మమూరు కాలువ కట్టలకు గండ్లు పడటం పరిపాటిగా మారింది. తాత్కాలిక మరమ్మతులతో మమ అనిపించటం నీటిసంఘాలు, అధికారుల చర్యలుగా ఉంటున్నాయి. దీంతో ఆయకట్టు పరిధిలో మాగాణి సాగు దిగుబడులు గాలిలో దీపంలా మారాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉండవల్లి కరకట్ట నుంచి కేబ్ల్యూడీ (కృష్ణా వెస్ట్రన్‌ డెల్టా) కాలువ ప్రారంభం అవుతుంది. ఇది దుగ్గిరాల మీదుగా బాపట్ల జిల్లాలో పెదగంజాం సీ మౌత్‌ వరకు ఉంటుంది. ఈ కాలువ పొడవు 122 కిలోమీటర్లు. 3.79 లక్షల ఎకరాల ఆయకట్టు. దుగ్గిరాల వద్ద ప్రధాన కాలువ ఈస్ట్‌, వెస్ట్‌, నిజాంపట్నం, నర్శాయపాలెంలో చీలుతుంది. అందులో దుగ్గిరాల నుంచి నర్శాయపాలెం మీదుగా సీమౌత్‌ వరకు వెళ్లే కాలువను కొమ్మమూరు కాలువగా పిలుస్తారు. దీని పరిధిలో 98వేల ఎకరాల సాగుభూమి ఉంది. ఇంత ప్రాధాన్యత ఉన్న కొమ్మమూరు కాలువకు నిధుల కేటాయింపులో మాత్రం ప్రభుత్వం చిన్న చూపు చూస్తోంది. నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శిస్తోందని రైతులు వాపోతున్నారు. కొమ్మమూరు కాలువ కట్టలు బలహీనంగా మారాయి. గత ఏడాది మొంథా తుఫాన్‌ సమయంలో కురిసిన భారీ వర్షాలు, వరదలకు కాలువ కట్టలకు భారీగా గండ్లు పడ్డాయి. వాటికి అధికారులు నీటి సంఘాల ద్వారా తాత్కాలిక మరమ్మతులతో మమ అనిపించారు. తరువాత శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టాల్సిన అవసరం ఉందని ఆయకట్టు రైతులు నీటి సంఘాల బాధ్యుల దృష్టికి తీసుకెళ్లారు. కాని ఫలితం శూన్యం. గత ఏడాది అక్టోబరులో విలయ తాండవం చేసిన మోంథా తుఫాన్‌తో పంటలకు భారీగా నష్టం వాటిల్లింది. కేంద్ర బృందం మీన మేషాలు లెక్కిస్తూ పంట నష్టాన్ని అంచనా వేశారు. ఆ పరిహారం కూడా రైతులకు నేటికి అందలేదు. ప్రత్యేక నిధులు కేటాయిస్తేనే పరిష్కారం.. కొమ్మమూరు కాలువ కట్టలకు సంబంధించి శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టాలంటే అందుకుగాను ప్రభుత్వ పరంగా ప్రత్యేక నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది. చిన్న, చిన్న పనులు తూటి కాడ తొలగించటం లాంటి మైయిన్‌టెనెన్స్‌ (ఓఎన్‌ఎం) పనులు నీటి సంఘాల బాధ్యులు చేస్తున్నారు. చేపట్టాల్సిన పనులకు సంబంధించి అధికారులు అంచనాలతో నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. వాటికి సంబంధించి కూడా ఇంకా నిధులు మంజూరు కాలేదు.

ప్రతి ఏటా తుపాన్లు, వరదల

సమయంలో కాలువ కట్టలకు గండ్లు

తాత్కాలిక పనులతో మమ అనిపిస్తున్న అధికారులు

నామ మాత్రంగానే నీటి సంఘాల చర్యలు

గాలిలో దీపంలా మాగాణి సాగు

నాడు ధాన్యాగారం.. నేడు దయనీయం

ఆయకట్టు ఘనం.. పంట భద్రత తీసికట్టు

ప్రతి ఏడాది కాలువకు గండ్లు..

నేటికీ అందని పంట నష్టపరిహారం..

కారంచేడు, స్వర్ణ గ్రామాల మధ్య కొమ్మమూరు కాలువకు పడ్డ గండికి అడ్డు గోడగా వేసిన

ఇసుక, మట్టి బస్తాలు

– మురళీధర్‌,

ప్రాజెక్ట్‌ కమిటీ చైర్మన్‌, రేపల్లె

Advertisement
 
Advertisement
Advertisement