రేపల్లె: ఇంధన కొరత జిల్లా ప్రజలను పట్టిపీడిస్తోంది. మూడో రోజు కూడా వాహనదారులకు ఆయిల్ కష్టాలు తప్పలేదు. జిల్లాలో ఇంధన కొరత లేదని, భయపడద్దని అధికారులు చేస్తున్న ప్రకటనలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. క్షేత్రస్థాయిలో వాహనదారులు డీజిల్, పెట్రోల్ కోసం బంకుల్లో పడిగాపులు పడుతున్నారు. అయినా దొరుకుతుందన్న ఆశ లేదు. ఎండ వేడిమిని తట్టుకుని ఆయిల్ కోసం నిరీక్షిస్తున్నారు. రేపల్లె పట్టణంలోని కృష్ణా టాకీస్ వెనుక బజారు పల్స్ ఆసుపత్రి సమీపంలోని బంక్, పండ్ల మార్కెట్ సెంటర్ ప్రాంతాలు సోమవారం వాహనాలతో నిండిపోవడంతో ఊపిరి తీసుకోవడానికి కూడా చోటు లేకుండా మారాయి. బారులుగా నిలిచిన వాహనాలు ట్రాఫిక్‌ను పూర్తిగా స్తంభింపజేసి, పరిస్థితిని మరింత క్లిష్టతరం చేశాయి. ఇంధన భయం నగరాన్ని పట్టిపీడిస్తున్న వేళ, ప్రజల పరుగులు ఆందోళన తీవ్రతను ప్రతిబింబిస్తున్నాయి.
బంకుల్లో నిరీక్షణ
కొల్లూరు: ఇంధనం కొరతతో వాహనదారులతోపాటు రైతులు, ఇటుక పరిశ్రమ దారులు కష్టాలు పడుతున్నారు. మూడు రోజులుగా డీజిల్, పెట్రోల్ సరఫరాలో కొరత కారణంగా ఇటుక సరఫరా చేసే లారీలు నిలిచిపోయాయి. డీజిల్ కొరతతో మోటరు పనిచేయక పంటలకు నీరు అందక ఎండిపోతున్నాయి. గంటల తరబడి ఇంధనం కోసం నిల్చున్నప్పటికీ తమ వంతు వచ్చే సరికి బంక్‌లో అయిల్ నిల్వ నిండుకుందన్న చావుకబురు బంక్‌ల నిర్వాహకులు చెబుతుండడంతో వాహనదారులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. అప్రమత్తమైన అధికార యంత్రాంగం ఆయిల్ అందుబాటులో ఉన్న బంక్‌లలో పంపిణీ చేపట్టాల్చిందేనని హెచ్చరించడంతో నిర్వాహకులు ఆయిల్ పంపిణీ చేపట్టారు. మండలంలో ఆరు పెట్రోల్ బంక్‌లు ఉండగా, దోనేపూడిలోని ఓ బంక్ మూత పడింది. మిగిలిన 5 బంక్‌లలో కొల్లూరులోని రెండు బంక్‌లు, దోనేపూడిలోని మరో బంక్‌లలో సోమవారం ఆయిల్ పంపణీ చేయడంతో రైతులు, వ్యాపారులు, వాహనదారులు పెద్ద సంఖ్యలో ఆయిల్ కోసం బంక్‌ల వద్దకు చేరుకున్నారు. మండలంలోని అనంతవరం, కొల్లూరు గౌడపాలెం సమీపంలోని మరో బంక్‌లో ఆయిల్ నిల్వ లేని కారణంగా పంపిణీ నిలిచిపోయింది.


