వేటకు టాటా.. సర్కారు దొంగాట | - | Sakshi
Sakshi News home page

వేటకు టాటా.. సర్కారు దొంగాట

Apr 14 2026 7:34 AM | Updated on Apr 14 2026 7:34 AM

వేటకు టాటా.. సర్కారు దొంగాట

మత్స్యకారులకు గడ్డుకాలం ఆగమనం రెండున్నర నెలల పాటు సముద్రంలో వేటపై నిషేధాజ్ఞలు రేపటి నుంచి వేట నిషేధం అమలు మత్స్యకార భృతి అందించడంలో సర్కారు మీనమేషాలు గతేడాది సాయం నేటికీ మంజూరు చేయని వైనం

జీవనభృతిని త్వరగా అందించాలి..

భృతికి మంగళం..

ఇకపై రెండున్నర నెలలపాటు సముద్ర తీర ప్రాంతాల్లో హైలెస్సా అనే మాటలు వినపడవు.. తీరాన మత్స్యకారుల సందడి కనిపించదు.. సముద్రంలో మత్య్సకారుల పడవలు కానరావు.. కడలి బోసిగా దర్శనమివ్వబోతోంది.. ప్రభుత్వం వేటపై నిషేధాజ్ఞలు జారీ చేయడంతో వేట తప్ప మరో పని తెలియని మత్స్యకారులకు ఈ సంధి కాలం కష్టాల సుడిగుండం కానుంది. చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటివరకు మత్స్యకార భృతి అందించకపోవడంతో గంగపుత్రుల పరిస్థితి మరింత దైన్యంగా మారనుంది.

చీరాల టౌన్‌: రెండున్నర నెలల వేట విరామ సమయంలో బతుకు బండి ఎలా నడపాలో తెలియక గంగపుత్రులు సతమతం అవుతున్నారు. చేయూతనివ్వాల్సిన ప్రభుత్వం మత్స్యకారుల సమస్యలను, కష్టాలను పట్టించుకున్న పాపానపోలేదు. గత ఏడాది ఇవ్వాల్సిన మత్స్యకార భృతి సాయం నేటికీ అందించలేదు. తమపై సీఎం చంద్రబాబు కపట ప్రేమ ఒలకబోస్తున్నారని మత్స్యకారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తీరంలో వారం రోజులుగా వేట చేసినా మత్స్య సంపద సరిగ్గా దొరక్కపోవడంతో నానా కష్టాలు అనునభవిస్తున్న మత్స్యకారుల పరిస్థితి.. వేట నిషేధం కాలం గడువు ముంచుకురావడంతో అగమ్యగోచరంగా మారింది. వివరాలు.. ఈ నెల 15 నుంచి జూన్‌ 15వ తేదీ వరకు సముద్రంలో చేపల వేట నిలుపుదల చేస్తున్నట్లు మత్స్యశాఖ అధికారులు ప్రకటించారు. ఏటా ఈ సమయంలో సముద్రంలో చేపల పునరుత్పత్తి జరుగుతున్న దృష్ట్యా మరబోట్లు, యాంత్రీకరణ తెప్పలతో వేట చేయడాన్ని ప్రభుత్వం నిలిపివేస్తుంది.

కుటుంబ పోషణ భారం

సాధారణంగా వాడరేవు మత్స్యకారులు కృష్ణా జిల్లా మచిలీపట్నం, నెల్లూరు జిల్లా రామాయపట్నం వరకు వేటకు వెళ్లి గురకలు, పాములు, బొంత, కూనాం, వంజరం, పండుగప్పలు లాంటి చేపలను పట్టుకొస్తుంటారు. కానీ ప్రస్తుతం సముద్రంలో వేట ఆశాజనకంగా లేకపోవడంతో మత్స్యకారులు తమ బోట్లను చిన్న జెట్టీ వద్ద, వలలను తీరం ఒడ్డున నిలుపుదల చేస్తున్నారు. వేట నిషేధ సమయం ఆసన్నమవ్వడంతో మత్స్యకారులు కుటుంబ పోషణ కోసం అవస్థలు పడుతున్నారు. మత్య్సకారుల అభ్యున్నతికి చేయాతనందిస్తున్నామని పాలకులు మాటల్లో చెబుతున్నారే తప్ప చేతల్లో చూపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు అందాల్సిన రాయితీలేవీ ప్రభుత్వం సక్రమంగా ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక్కో బోటుకు ఆరుగురు మత్స్యకారులు ఉంటారు. ఒక్కో మత్య్సకారుడికి రూ.20వేలు ఇస్తామన్న హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు గంగలో కలిపేశారు. వైఎస్సార్‌ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో 2019 నుంచి 2023 జూన్‌ వరకు వేట నిషేధ సాయం ఒక్కో మత్స్యకారుడికి రూ.10 వేలు అందించగా, టీడీపీ ప్రభుత్వానికి మాత్రం గంగపుత్రుల ఆవేదన మచ్చుకై నా పట్టడం లేదు. మత్స్యకార భృతి పథకంపై టీడీపీ ప్రభుత్వం పలు ఆంక్షలు విధించడం, సర్వే, రీసర్వే పేరుతో కాలయాపన చేయడంతో వేలాది మంది మత్స్యకారులు లబోదిబోమంటున్నారు. జిల్లాలోని చీరాల, పర్చూరు, బాపట్ల, రేపల్లె, అద్దంకి, వేమూరు నియోజకవర్గాల్లో మత్స్యకార జనాభా సుమారు 53,000 మంది ఉన్నారు. వీరిలో సముద్రంలో వేటకు వెళ్లే వారు 16,500 మంది ఉన్నారు. జిల్లాలో చీరాల, వేటపాలెం, బాపట్ల, రెపల్లె, బీవీపాలెం తదితర ఏడు తీరప్రాంత మండలాల్లో 76 కిలోమీటర్ల మేర కోస్టల్‌ లైన్‌ విస్తరించి ఉంది. వేట నిషేధ సమయంలో మత్స్యకారులు ఇంటి వద్ద ఉంటూ వలలకు మరమ్మతులు చేసుకుంటుంటారు. వరుస విపత్తులతో అల్లాడుతున్న తమకు ప్రభుత్వం సరైన సమయంలో సాయం అందించకపోతే ఎలా బతకాలని మత్స్యకారులు ప్రశ్నిస్తున్నారు.

మత్స్యకారులకు వేట నిషేధంలో అందిస్తామన్న జీవన భృతి రూ.20 వేలను పాలకులు త్వరగా అందించి ఆదుకోవాలి. వేట నిషేధ సాయం ఆలస్యమైతే మేమంతా అప్పులు చేసి కాపురాలు నెట్టుకురావాల్సి వస్తుంది. ఇచ్చిన హామీ ప్రకారం సీఎం చంద్రబాబునాయుడు మత్స్యకారులకు సాయం త్వరగా అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అలానే మత్స్యకారులకు రావాల్సిన ఇతర పథకాలకు నిధులు మంజూరు చేయాలి. కుటుంబ పోషణకు ఇబ్బందులు పడకుండా ఆదుకోవాలి.

– ఎస్‌.నూకాలు, మత్స్యకారుడు, వాడరేవు

Advertisement
 
Advertisement
Advertisement