పంటపొలాలకు దారి సమస్యపై రైతుల పోరు‘బాట’
టీడీపీ నేతల అండతో పంట ఉత్పత్తుల తరలింపునకు ఉన్న దారిని మూసేసిన పెద్ద రైతులు కొల్లూరు రెవెన్యూ కార్యాలయాన్ని ముట్టడించిన చిన్న, సన్నకారు రైతులు టీడీపీ నాయకుడి ఒత్తిడికి రెవెన్యూ యంత్రాంగం తలొగ్గుతున్నారని ఆక్రోశం దారి సమస్య బాధిత రైతాంగంలో టీడీపీ, వైఎస్సార్ సీపీ నాయకులు
రేపటిలోగా పరిష్కరిస్తాం..
కొల్లూరు: పంట ఉత్పత్తుల తరలింపునకు ఉన్న బాటను సాధించుకునేందుకు అన్నదాతలు పోరు బాట పట్టారు. రెక్కల కష్టంతో శ్వేదం చిందించి సంపాదించుకున్న సొమ్మును విరాళాల రూపంలో సేకరించుకొని రూ.7లక్షలు వెచ్చించి స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకున్న బళ్ల దారి మార్గాన్ని పచ్చ పార్టీ నాయకుల అండదండలతో కబళిస్తున్న పెద్ద రైతుల కబంధ హస్తాల నుంచి దక్కించుకునేందుకు కర్షకులు రోడ్డెక్కి నిరసన గళం విప్పారు. టీడీపీకి చెందిన ఓ రాజకీయ నాయకుడి ఒత్తిళ్లకు తలొగ్గి రెవెన్యూ యంత్రాంగం దారి సమస్యను పరిష్కరించకపోవడాన్ని నిరసిస్తూ రైతులు రెవెన్యు కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళనకు దిగి తమ ఆవేదనను వెళ్లగక్కారు. సోమవారం కొల్లూరు రెవెన్యు కార్యాలయ ఆవరణలో బైఠాయించి సన్న, చిన్న కారు రైతులు నిరసన వ్యక్తం చేశారు.
అసలేం జరిగింది..
కొల్లూరు శివారు కేటీ కాలనీ మార్గంలోని ఈద్గా వద్ద ఉన్న బళ్ల బాట విషయంలో గత కొద్ది కాలంగా వివాదం నడుస్తుంది. ప్రభుత్వ రికార్డుల ప్రకారం బళ్ల బాటగా ఉన్నప్పటికీ, సాగునీటి పారుదల కాలువ, బోదె కాలువల ఏర్పాటులో ప్రభుత్వ శాఖల సమన్వయ లోపం సమస్యకు ప్రధాన కారణంగా మారింది. గతంలో బళ్ల మార్గం ద్వారా పంట ఉత్పత్తులను తరలించుకోవడానికి అవకాశం ఉందన్న విషయం తెలుసుకున్న 200 ఎకరాల పై చిలుకు పంట భూములున్న సన్న, చిన్న కారు రైతులు స్వచ్ఛందంగా చందాలు వేసుకొని వంతెన నిర్మించుకొని పంట ఉత్పత్తుల తరలింపునకు వీలుగా బళ్ల మార్గాన్ని పునరుద్ధరించారు. అయితే కేటీ కాలనీ ప్రధాన మార్గానికి ఆనుకొని ఉన్న ఒకరిద్దరు రైతులు బళ్ల మార్గం ఏర్పాటు విషయంలో ఆక్షేపించడంతో దారి అంశంపై కోర్టును ఆశ్రయించారు.
రైతుల పంటపొలాలకు వెళ్లాల్చిన దారి సమస్య పరిష్కారానికి కొద్ది గడువు కోరడం జరిగింది. దారి వివాదం కారణంగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి అధికారుల దృష్టికి తీసుకువెళ్లి బుధవారం లోపు సమస్యను పరిష్కరిస్తాం. బుధవారం నుంచి రైతులు సాగు చేసిన మొక్కజొన్న, జొన్న పంటలను బళ్ల మార్గం ద్వారా తరలించుకునేలా చర్యలు తీసుకుంటాం.
– బి.వెంకటేశ్వర్లు, కొల్లూరు తహసీల్దార్


