కలెక్టరేట్‌లో చలివేంద్రం ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

కలెక్టరేట్‌లో చలివేంద్రం ప్రారంభం

Apr 14 2026 7:34 AM | Updated on Apr 14 2026 7:34 AM

కలెక్టరేట్‌లో చలివేంద్రం ప్రారంభం బాణసంచా అమ్మకందారులు లైసెన్స్‌లు తీసుకోవాలి ఆరు సిలిండర్లు స్వాధీనం జ్వాలాముఖి అమ్మవారికి స్వర్ణకవచం సమర్పణ

గుంటూరు వెస్ట్‌: కలెక్టరేట్‌ ఆవరణలో చలివేంద్రాన్ని జిల్లా కలెక్టర్‌ సి.ఎం.సాయికాంత్‌ వర్మ, జాయింట్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాస్తవతో కలిసి సోమవారం ప్రారంభించారు. పీజీఆర్‌ఎస్‌కు విచ్చేసిన దరఖాస్తుదారులకు మజ్జిగ కూడా పంపిణీ చేశారు. వేసవి ఎండలు దృష్ట్యా కలెక్టరేట్‌ అవరణలోని వివిధ శాఖల కార్యాలయాలకు వచ్చే సందర్శకుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ తెలిపారు. ప్రతి సోమవారం చలివేంద్రంలో నీరు, మజ్జిగ పంపిణీ చేయటం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో డీఆర్వో షేక్‌ ఖాజావలి, జిల్లా విపత్తుల నిర్వహణ ప్రాజెక్టు డైరెక్టర్‌ లక్ష్మీకుమారి, జెడ్పీ సీఈఓ వి జ్యోతిబసు, డీఆర్డీఎ పీడీ విజయలక్ష్మి, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు చెన్నయ్య, డీఎఫ్‌ఓ శ్రీనివాసరెడ్డి, కలెక్టర్‌ కార్యాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

పల్నాడు జిల్లా జేసీ సంజనా సింహ

నరసరావుపేట: బాణసంచా అమ్మకందారులు తప్పనిసరిగా లైసెన్సులు తీసుకోవాలని పల్నాడు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ సంజనా సింహ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో ఫైర్‌ క్రాకర్స్‌ వ్యాపారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జాయింట్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ లైసెన్స్‌ లేని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రెన్యువల్‌ ముగిసిన వారు వెంటనే చేయించుకోవాలని సూచించారు. వేసవి కాలంలో షాపు నిర్వాహకులు, క్రాకర్స్‌ నిర్వాహకులు అగ్నిప్రమాదాలు జరగకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

నగరంపాలెం: దుకాణాలు, హోటళ్లల్లో గుంటూరు ప్రాంతీయ విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగపు అధికారుల తనిఖీలు సోమవారం కొనసాగాయి. పెదనందిపాడు దత్తసాయి ఆర్యవైశ్య హోటల్‌, శ్రీలక్ష్మీ దుర్గా మెస్‌లో గృహ వినియోగ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నట్లు గుర్తించారు. ఆయా తనిఖీల్లో గుర్తించిన ఆరు సిలిండర్లను స్థానిక చిలకలూరిపేట ఎంఆర్‌ఐ, ప్రత్తిపాడు సీఎస్‌ డీటీలకు అప్పగించారు. ఆయా మెస్‌ల నిర్వాహకులపై 6–ఏ కేసులు రెండు నమోదు చేశారు. విజిలెనన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగపు అధికారులు, స్థానిక పౌరసరఫరాల శాఖ అధికార, సిబ్బంది పాల్గొన్నారు.

అమరావతి: ప్రసిద్ధ పుణ్యక్షేతమైన అమరావతి అమరేశ్వరాలయంలో వేంచేసిన్న జ్వాలాముఖిదేవి అమ్మవారికి సోమవారం స్వర్ణకవచాన్ని సమర్పించారు. దేవదాయశాఖలో అసిస్టెంట్‌ కమిషనర్‌గా పనిచేస్తున్న ఎన్‌.శ్రీనివాసరెడ్డి అమ్మవారికి రాగిపై బంగారుపూత వేసిన కవచాన్ని సమర్పించారు. సుమారు 40గ్రాముల బంగారంతో సుమారు రూ.6 లక్షల విలువైన వెండి కవచాన్ని అర్చకులు సంప్రోక్షణ అనంతరం ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి అలంకరించారు. తొలుత దాతలు అమరేశ్వరునికి అభిషేకం, బాలచాముండేశ్వరి, అమ్మవార్లకు, జ్వాలాముఖి అమ్మవారికి కుంకుమపూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement