తొమ్మిది బైక్‌లు, రెండు కార్లు ధ్వంసం
చీరాల టౌన్: డ్రైవింగ్‌లో ఏమాత్రం నైపుణ్యం లేని ఓ వ్యక్తి కారు నడిపి బీభత్సం సృష్టించాడు. సోమవారం మధ్యాహ్నం చీరాల తహసీల్దార్ కార్యాలయంలో చోటుచేసుకున్న ఈ ఘటనతో భయానక పరిస్థితి ఏర్పడింది. ప్రమాదం ధాటికి తహసీల్దార్ కార్యాలయం ముందు పార్కింగ్ చేసిన తొమ్మిది ద్విచక్ర వాహనాలు, మరో రెండు కార్లు దెబ్బతిన్నాయి. వివరాలు.. చీరాల తహసీల్దార్ కార్యాలయానికి సమీపంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఉంది. కావలికి చెందిన ఒక సీఐ బంధువు చీరాల్లో భూమి రిజిస్ట్రేషన్ కోసం కారులో వచ్చాడు. తన వాహనాన్ని పార్కింగ్ చేసేందుకు తహసీల్దార్ కార్యాలయం ఆవరణలోకి తీసుకొచ్చాడు. ఈ క్రమంలో కారు అదుపుతప్పి పార్కింగ్‌లో ఉంచిన బైకులు, కార్లను ఢీకొట్టింది. తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహిస్తుండటంతో అర్జీలు ఇచ్చేందుకు వచ్చిన ప్రజలు, పలు శాఖల అధికారుల వాహనాలతో ఆ ఆవరణ కిక్కిరిసిపోయింది. మధ్యాహ్నం ఒక్కసారిగా కారు బీభత్సం సృష్టించడంతో పలుశాఖల అధికారులు, సిబ్బందికి చెందిన తొమ్మిది ద్విచక్ర వాహనాలు, రెండు కార్లు ధ్వంసమయ్యాయి. ప్రమాదం విషయం తెలుసుకున్న తహసీల్దార్ గోపీకృష్ణ బయటకు వచ్చి స్థానికుల సాయంతో కారు ఇంజిన్‌ను నిలిపివేయించి, పోలీసులకు సమాచారం అందించారు. భూముల రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వారి వాహనాలన్నీ రెవెన్యూ కార్యాలయం ఆవరణలో పార్కింగ్ చేయడంతో తరచూ ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఇకపై ప్రైవేట్ వ్యక్తుల వాహనాలు పార్కింగ్ చేయకుండా చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ తెలిపారు. ఇదిలా ఉండగా, సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదంలో దెబ్బతిన్న వాహనాలకు మరమ్మతులు చేయిస్తామని వెంట తీసుకెళ్లారు. ప్రమాదానికి కారణమైన కారు కావలికి చెందిన ఓ సీఐది కాబట్టి పోలీసులు వెంటనే రాజీ యత్నాలు చేశారని స్థానికులు చర్చించుకుంటున్నారు.


