అనధికారికంగా టోల్ వసూలుచేస్తే కఠిన చర్యలు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్
బాపట్లటౌన్: తీరంలో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ తెలిపారు. సూర్యలంక బీచ్ ప్రాంతాల్లో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరగనున్న అభివృద్ధి పనులకు సంబంధించి భూములను ఆర్డీఓ పి.గ్లోరియా, జిల్లా అటవీశాఖ అధికారి రవిశంకర్‌తో పరిశీలించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సూర్యలంక బీచ్ ప్రాంతంలో జరుగుతున్న పర్యాటక అభివృద్ధికి సంబంధించి పనులు వేగవంతంగా పూర్తిచేయాలని పర్యాటక శాఖ అధికారులను ఆదేశించారు. సూర్యలంక అడవి రెవెన్యూ పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ భూములను మ్యాప్ ద్వారా మండల సర్వే అధికారులు కలెక్టర్‌కు వివరించారు. ఖాళీ ప్రదేశం చుట్టూ ప్రహరీ ఏర్పాటు చేసేందుకు సంబంధించి అంచనా తయారు చేయాలని ఆర్డీఓను ఆదేశించారు. ఆ సర్వే నెంబర్‌లో ఆక్రమణకు గురైన ప్రాంతంను ఖాళీ చేయించేందుకు నోటీసులు జారీ చేయాలని ఆర్డీఓ, తహసీల్దార్‌లను ఆదేశించారు. సూర్యలంక బీచ్ వద్ద అనధికారికంగా టోల్ గేట్ వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అనధికారికంగా టోల్ గేట్ వసూల్ చేస్తున్న షేడ్‌ను జిల్లా కలెక్టర్ దగ్గర ఉండి తొలగించారు. ల్యాండ్ అండ్ సర్వే శాఖ ఏడీ సాంబశివరావు, తహసీల్దార్ షేక్ సలీమా, పర్యాటక, అటవీ, పోలీస్ శాఖల అధికారులు పాల్గొన్నారు.


