రేపల్లె: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రతి వారం జిల్లాలోని ఒక్కొక్క నియోజకవర్గంలో నిర్వహిస్తున్నట్లు బాపట్ల జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ పేర్కొన్నారు. పట్టణ సర్కిల్ కార్యాలయ ఆవరణలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి మాట్లాడారు. నియోజకవర్గ ప్రజలు చట్టపరమైన సమస్యలు పరిష్కరించేందుకు ఈ ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సాధారణ ప్రజలతోపాటు వృద్ధులు, వికలాంగులు, మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చే అర్జీలను చట్టపరిధిలో విచారించి నిర్ణీత గడువులోపు పరిష్కరిస్తామని తెలిపారు. కుటుంబ సమస్యలు, భూవివాదాలు, ఆర్థిక లావాదేవీలు, ఇతర పలు సమస్యలపై నిర్వహించిన ఈ సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో రేపల్లె పరిసర ప్రాంతాల నుంచి 28 మంది అర్జీలు అందజేశారని పేర్కొన్నారు. అర్జీలను నిర్ణీత గడువులోపు పరిష్కరిస్తామని చెప్పారు. కార్యక్రమంలో రేపల్లె డీఎస్పీ ఆవుల శ్రీనివాసరావు, సీసీఎస్ డీఎప్పీ జగదీష్ నాయక్, పీజీఆర్‌ఎస్ సెల్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు, సీఐలు మల్లికార్జునరావు, సురేష్, ఎస్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.


