డ్రగ్స్‌ ఆరోగ్య సమస్య కాదు – భద్రత సమస్య | - | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌ ఆరోగ్య సమస్య కాదు – భద్రత సమస్య

Apr 14 2026 7:34 AM | Updated on Apr 14 2026 7:34 AM

ఈగల్‌ ఐజీ ఆకే రవికృష్ణ

చేబ్రోలు: డ్రగ్స్‌ ఆరోగ్య సమస్య, నేర సమస్య మాత్రమే కాదు, జాతీయ భద్రతకు తీవ్రమైన ముప్పు అని ఈగల్‌ ఐజీ ఆకే రవికృష్ణ పేర్కొన్నారు. డ్రగ్స్‌ ద్వారా వచ్చే డబ్బు ఉగ్రవాద సంస్థలకు చేరి దేశానికి హానికరంగా మారుతోందన్నారు. దీనిని ‘నార్కో టెర్రరిజం’గా అభివర్ణించారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్‌ యూనివర్సిటీలో, వైబ్రెంట్స్‌ ఆఫ్‌ కలాం సంస్థ ఆధ్వర్యంలో, ఈగల్‌ టీమ్‌ సహకారంతో ‘డ్రగ్‌ ఫ్రీ ఆంధ్రప్రదేశ్‌ మిషన్‌ – దండి మార్చ్‌ 2.0’ పేరుతో నిర్వహిస్తున్న 1000 కిలోమీటర్ల సైకిల్‌ యాత్ర 8వ రోజు విజ్ఞాన్‌ యూనివర్సిటీకి చేరింది. డ్రగ్స్‌ నిర్మూలన లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమంగా ‘ది గ్రేటెస్ట్‌ డ్రగ్‌–ఫ్రీ మార్చ్‌ ఆన్‌ ఎర్త్‌’ అనే సందేశంతో యువతను మత్తు పదార్థాల నుండి దూరంగా ఉంచేందుకు ఈ యాత్రను ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నారు. కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఈగల్‌ ఐజీ ఆకే రవికృష్ణ, విజ్ఞాన్‌ విద్యాసంస్థల చైర్మన్‌ లావు రత్తయ్య ఆవిష్కరించారు. 100 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఈగల్‌ ఏఎస్‌పీ స్వరూపరాణి, తెనాలి డీఎస్పీ మల్లికార్జునరావు, రిజిస్ట్రార్‌ పీఎంవీ రావు, డీన్‌లు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement