ఉత్తమ ప్రదర్శనగా శ్రీమాత్రే నమః నాటిక | - | Sakshi
Sakshi News home page

ఉత్తమ ప్రదర్శనగా శ్రీమాత్రే నమః నాటిక

Apr 14 2026 7:34 AM | Updated on Apr 14 2026 7:34 AM

● ముగిసిన కొండవీటి కళాపరిషత్‌ నాటిక పోటీలు ● ప్రేక్షక హృదయాల్ని దోచుకున్న ప్రద్శనలు

యడ్లపాడు: చారిత్రక వైభవానికి నిలయమైన కొండవీడు ప్రాంతంలో అద్భుత కళాసౌరభాలు విరబూశాయి. లింగారావుపాలెం గ్రామంలోని పోసాని సుబ్బారావు కళావేదికపై మూడు రోజుల పాటు జరిగిన కొండవీటి కళాపరిషత్‌ 27వ జాతీయ స్థాయి ఆహ్వాన నాటిక పోటీలు ఆదివారం రాత్రి ఘనంగా ముగిశాయి. తొమ్మిది విభిన్న నాటికలు ప్రదర్శితమైన ఈ వేదికపై కథా బలం, నటీనటుల అభినయం, సాంకేతిక హంగులు పోటీపడి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. పోటీలకు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన రమణారావు, ఏ నర్సిరెడ్డి, గోపరాజు విజయ్‌ అత్యంత పారదర్శకతతో విజేతలను ఎంపిక చేశారు.

ఉత్తమ ప్రదర్శనగా శ్రీమాత్రే నమః నాటిక.

ప్రదర్శనల విభాగంలో హైదరాబాద్‌కు చెందిన స్వర్ణ సూర్య డ్రామా లవర్స్‌ వారు ప్రదర్శించిన ‘శ్రీమాత్రే నమః’ నాటిక తన అద్భుత ప్రదర్శనతో ప్రథమ స్థానాన్ని కై వసం చేసుకుని ఉత్తమ ప్రదర్శన బహుమతిని గెలుచుకుంది. విజయవాడ సాంస్కృతిక సమితి వారి ‘మమ్మల్ని బతకనివ్వండి’ నాటిక ద్వితీయ బహుమతిని గెలుచుకోగా, గోవాడ క్రియేషన్స్‌ హైదరాబాద్‌ వారి ‘అమ్మ చెక్కిన బొమ్మ’ నాటిక తృతీయ స్థానంలో నిలిచింది. గుంటూరు అభినయ ఆర్ట్స్‌ వారి ‘ఇది అతని సంతకం’ నాటిక జ్యూరీ ప్రత్యేక ప్రదర్శనగా గుర్తింపు పొంది విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

అభినయ విభాగంలో..

కళాకారుల అభినయంలో... ‘మమ్మల్ని బతకనివ్వండి’ నాటిక అవార్డుల పంట పండించింది. ఈ నాటికలో ముత్యాలరావు పాత్రలో ఒదిగిపోయిన ఈఎస్‌ పవన్‌ కుమార్‌ ఉత్తమ నటుడిగా, రమణమ్మ పాత్రలో భావోద్వేగాలను పండించిన ఆర్‌.రాజేశ్వరి ఉత్తమ నటిగా నిలిచారు. ఇదే నాటికకు దర్శకత్వం వహించిన సుఖమంచి కోటేశ్వరరావు ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యారు. ‘శ్రీమాత్రే నమః’ నాటికకు పదునైన మాటలు అందించిన ఉదయ భాగవతుల ఉత్తమ రచయితగా అవార్డు అందుకున్నారు. ‘తరమెల్లి పోతున్నదో’ నాటికలో రంగనాథం పాత్ర పోషించిన ఎన్‌.శ్రీధర్‌ ఉత్తమ సహాయ నటుడిగా ఎంపికవగా, మాతృత్వం నాటిక సంతోష్‌ పాత్రధారి.. పొగర్తి నాగేశ్వరరావు, మంచిమనసులు నాటిక సూర్య పాత్రధారి.. నడింపల్లి వెంకటేశ్వర్లు తమ నటనకు గానూ ప్రత్యేక ప్రశంసా బహుమతులు అందుకున్నారు. ఉత్తమ ప్రదర్శనలు, నటులకు పరిషత్‌ నిర్వాహకులు నగదు పారితోషికంతో పాటు జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో పరిషత్‌ అధ్యక్షులు కట్టా శ్రీహరిరావు, ఉపాధ్యక్షులు తోకల సాంబశివరావు, నంబూరి వీరాంజనేయులు, ప్రధాన కార్యదర్శి మండెపూడి శ్రీనివాసరావు, ఆర్గనైజింగ్‌ కార్యదర్శులు మల్నేని సీతారామాంజనేయులు, కనపర్తి శ్రీనివాసరావు, కోశాధికారులు కట్టా వీరాంజనేయులు, నంబూరు శివరామకృష్ణ, బ్రహ్మ వరప్రసాద్‌, పర్యవేక్షకులు జరుగుల రామారావు వీటిని అందజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement