మార్టూరు: భూ వివాదంలో ఏకపక్షంగా ఓ వర్గానికి కొమ్ము కాస్తూ మార్టూరు సీఐ యార్లగడ్డ శ్రీనివాసరావు తమ కుటుంబాన్ని వేధిస్తున్నారంటూ మండలంలోని కోలలపూడి గ్రామానికి చెందిన కుంచపు శ్రీనివాసరావు సోమవారం బాపట్ల గ్రీవెన్స్‌లో జిల్లా కలెక్టర్, ఎస్పీ కార్యాలయాల్లో ఫిర్యాదు చేశాడు. బాధితుడి శ్రీనివాసరావు తెలిపిన వివరాల మేరకు.. కోలలపూడి సర్వే నంబర్ 150లో శ్రీనివాసరావు కుటుంబ స్వాధీనంలో దశాబ్దాల కాలంగా ఐదు సెంట్లు భూమి ఉంది. ఈ భూమి విషయమై శ్రీనివాసరావు సామాజిక వర్గానికే చెందిన మరో కుటుంబంతో కొంతకాలంగా వివాదం నడుస్తోంది. అందులో భాగంగా రెండు నెలల కిందట ఇరువర్గాలను స్థానిక తహసీల్దార్ ముందు పోలీసులు బైండోవర్ చేశారు. ఈ క్రమంలో గత ఆదివారం సీఐ శ్రీనివాసరావు స్టేషన్‌కు రమ్మన్నారంటూ పోలీస్‌స్టేషన్ నుంచి శ్రీనివాసరావుకు పిలుపు వచ్చింది. ఆదివారం ఉదయం 10 గంటలకు స్టేషన్‌కు వెళ్లిన శ్రీనివాసరావు దంపతులను సిబ్బంది సాయంత్రం రావాలంటూ తిప్పి పంపించారు. రాత్రి 9 గంటలకు స్టేషన్‌కు వచ్చిన సీఐ బాధితుడు శ్రీనివాసరావును తన గదిలోకి పిలిపించాడు. తనను ఏ కారణంతో స్టేషన్‌కు పిలిపించారనే విషయాన్ని పలుమార్లు అడుగుతున్నా చెప్పకుండా సీఐ చెప్పటానికి వీలులేని అసభ్య పదజాలంతో దూషిస్తూ తనను భయపెట్టాడని చెప్పాన్నాడు. వివాదాస్పద భూమిలో ఉన్న సీసీ కెమెరాలను ధ్వంసం చేస్తావంటరా.. నా కొడకా.. నాతో పెట్టుకుంటే లాఠీ దించుతాను అంటూ రాయడానికి వీలులేని పదజాలంతో తనను తీవ్రంగా సీఐ దూషించినట్లు శ్రీనివాసరావు తెలిపాడు. సీసీ కెమెరాలను ఎవరూ ధ్వంసం చేయలేదని యథాస్థితిలోనే ఉన్నాయని వచ్చి పరిశీలించుకోవాలని తాను చెబుతున్నా సీఐ తనను మాట్లాడనివ్వకుండా తిడుతూనే ఉన్నారన్నారు. రాత్రి 11 గంటల వరకు తనను తన భార్యను పోలీస్ స్టేషన్ లోనే కూర్చోబెట్టిన సీఐ తరువాత ఇంటికి పంపించినట్లు వివరించాడు. తమ గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకుల ఆదేశాలను పాటిస్తూ తనను సీఐ స్టేషన్‌కు పిలిపించి దూషించినట్లు చెప్పారు. తనకు ఇక్కడ ఎలాంటి న్యాయం జరగదని భావించి జరిగిన విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేయాల్సిందిగా కలెక్టర్, ఎస్పీ కార్యాలయాల్లో ఫిర్యాదు చేసినట్లు శ్రీనివాసరావు విలేకరులకు తెలిపాడు.


