గుర్తుతెలియని వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

గుర్తుతెలియని వ్యక్తి మృతి

Apr 14 2026 7:34 AM | Updated on Apr 14 2026 7:34 AM

బాపట్లటౌన్‌: బాపట్ల ఏరియా వైద్యశాలలో గుర్తుతెలియని వృద్ధుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. పట్టణ పోలీసుల కథనం ప్రకారం... ఈనెల 11న పట్టణంలోని గుంటూరు రైల్వే ఓవర్‌బ్రిడ్జి సమీపంలో 70 సంవత్సరాల వృద్ధుడు అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు 108 సమాచారం అందించారు. 108 సిబ్బంది వృద్ధుడిని చికిత్స నిమిత్తం బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించారు. మూడు రోజులుగా చికిత్స పొందుతున్న వృద్ధుడు సోమవారం సాయంత్రం మృతిచెందారు. ఈ మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసు కొని దర్యాప్తు చేస్తున్నారు.

అడ్మిషన్ల పేరుతో ప్రైవేట్‌ టీచర్లపై వేధింపులు అన్యాయం

నరసరావుపేట: ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలల యాజమాన్యాలు అడ్మిషన్ల పేరుతో టీచర్లపై తీవ్ర ఒత్తిడి పెడుతున్నాయని డెమెక్రటిక్‌ యూత్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా(డీవైఎఫ్‌ఐ) జిల్లా ప్రధాన కార్యదర్శి ఇ.ఆంజనేయరాజు సోమవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. ప్రైవేటు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ఈ ఒత్తిడిని అరికట్టడంలో విద్యాశాఖ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. విద్యా హక్కు చట్టం ప్రకారం జూన్‌న్‌లో మాత్రమే అడ్మిషన్లు ప్రారంభించాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా కొన్ని పాఠశాలలు డిసెంబర్‌ నుంచే ముందస్తు అడ్మిషన్లు చేపట్టి నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయని వివరించారు. ప్రతి రోజు స్కూల్‌ ముగిసిన తర్వాత టీచర్లను ఇంటింటికీ పంపిస్తూ అడ్మిషన్ల కోసం ప్రచారం చేయిస్తున్నారని, వారికి టార్గెట్లు విధించి ఒత్తిడి తెస్తున్నారని చెప్పారు. టార్గెట్లు పూర్తి చేయకపోతే జీతాలు నిలిపివేయడం, ఉద్యోగం తీసేస్తామని బెదిరించడం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా విద్యా శాఖ అధికారులు దృష్టి సారించి ముందస్తు అడ్మిషన్లు నిలిపివేయాలని, టీచర్లపై వేధింపులు ఆపేలా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. సెలవు రోజుల్లో కూడా పూర్తి జీతభత్యాలు చెల్లించాలనే నిబంధనలు ఉల్లంఘించే పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement