చీరాల: చీరాల మున్సిపాలిటీకి అత్యధికంగా ఆదాయాన్ని ఇచ్చే నెహ్రూ కూరగాయల మార్కెట్ చీటీల వేలం నాటకీయ పరిణామాల నడుమ ఎట్టకేలకు నిర్వహించారు. వారం రోజుల్లో మూడు సార్లు వేలం ప్రక్రియ వాయిదా పడింది. అధికారులు గతంలో హెచ్చు పాటకు వెళ్లడంతో అర్ధంతరంగా వాయిదా పడగా తాజాగా సోమవారం మున్సిపల్ కార్యాలయంలో వేలం నిర్వహించారు. చీరాల నెహ్రూ కూరగాయల మార్కెట్‌లో చీటీల వసూలుకు సంబంధించి కాంట్రాక్టు మార్చి 31తో ముగిసింది. 2025–2026 సంవత్సరానికి రూ.70.87 లక్షల ఆదాయం రాగా, 2026–2027కు గాను రూ.70.48 లక్షలతో వేలం ప్రక్రియ ప్రారంభించారు. మొత్తం ఆరుగురు పోటీపడగా రూ.87.56 లక్షలకు కోలా శివకృష్ణ చీటీల వేలం హక్కులు దక్కించుకున్నారు. అలాగే తోపుడు బండ్లపై వ్యాపారం నిర్వహించే వ్యాపారుల నుంచి రుసుం వసూలు చేసే వేలాన్ని రూ.11.50 లక్షల నుంచి ప్రారంభించారు. వేలంలో తొమ్మిది మంది పాల్గొనగా రూ.18,05,000కు ఓ వ్యక్తి హక్కులు దక్కించుకున్నారు. అలానే పేరాల మార్కెట్‌కు సంబంధించిన వేలంలో తొమ్మిది మంది పోటీపడగా రూ.8.35 లక్షలు పలికింది. ఇదిలా ఉండగా వారం రోజుల్లో మూడు సార్లు వేలం వాయిదా వేయడం వెనుక రాజకీయ హస్తం ఉందనే అనుమానాలు కలుగుతున్నాయి. అయితే సోమవారం నిర్వహించాల్సింది బహింగ వేలం కాగా తలుపులు మూసివేసి పోలీసుల పర్యవేక్షణలో వేలం నిర్వహించడం గమనార్హం.


