టీడీపీ మాజీ కార్పొరేటర్‌పై సిటిబస్‌ల యజమానుల ఫిర్యాదు | - | Sakshi
Sakshi News home page

టీడీపీ మాజీ కార్పొరేటర్‌పై సిటిబస్‌ల యజమానుల ఫిర్యాదు

Apr 14 2026 7:34 AM | Updated on Apr 14 2026 7:34 AM

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: కోవిడ్‌–19 క్వారెంటైన్‌ సెంటర్‌కు సిటిబస్‌లు ఏర్పాటుచేశామని, ఆ బస్‌లకు సంబంధించి లక్షల రూపాయల బిల్లులు చెల్లించకుండా టీడీపీ మాజీ కార్పొరేటర్‌ ఇబ్బందులకు గురిచేస్తున్నారని బస్‌ యజమానులు సోమవారం గుంటూరు జిల్లా పోలీస్‌ కార్యాలయ ఆవరణలోని పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు. టీడీపీ మాజీ కార్పొరేటర్‌ తీరుపై ఫ్లెక్సీతో నిరసన వ్యక్తం చేశారు. 2020 సెప్టెంబర్‌లో గుంటూరు ఆర్‌టీవో ద్వారా ఈపూరు మండలం ఎంఆర్‌ఓ కార్యాలయం వద్ద క్వారంటైన్‌ సెంటర్‌ కింద బస్‌ ఏర్పాటు చేశామని సిటిబస్‌ యజమాని నళిని, ఆమె భర్త శివరామప్రసాద్‌ మీడియాకు తెలిపారు. సెప్టెంబర్‌ 16 నుంచి డిసెంబర్‌ మూడో తేదీ వరకు అక్కడే ఉంచామని అన్నారు. ఏళ్లు గడిచినా బిల్లులు చెల్లించకపోవడంతో గుంటూరు ఆర్‌టివో అధికారులను సంప్రదించామని చెప్పారు. సిటిబస్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ గుంటూరు కార్యదర్శి, టీడీపీ 35వ డివిజన్‌ మాజీ కార్పొరేటర్‌ వరప్రసాద్‌బాబు (సిటిబస్‌)కి చెల్లించామని తెలియజేశారని తెలిపారు. ఈ విషయమై బస్‌బాబుని అడగ్గా, బెదిరింపులకు పాల్పడుతున్నారని వాపోయారు. కోవిడ్‌–19 వేళల్లో బస్‌ ఏర్పాటు చేశానని, లక్ష రూపాయలు రావాల్సి ఉందని మరో బస్‌ యజమాని వడ్లమూడి కిషోర్‌ తెలిపారు. జీవనోపాధి నిమిత్తం తాను కొనుగోలు చేసిన సిటిబస్‌ను బస్‌బాబుకి అప్పగించినట్లు మరో బాధితుడైన ఎం.రమేష్‌ చెప్పారు. బస్‌కు సంబంధించి రోడ్డు పన్ను ఇతరత్రా పన్నులు చెల్లించాలని అతనితో ఒప్పందం చేసుకున్నానని అన్నారు. బీమా కూడా చెల్లించకుండా నకిలీ బీమాతో బస్సు నడిపాడని ఆరోపించారు. ప్రస్తుతం నా బస్‌ని అప్పగించాలని కోరగా, బెదిరింపులకు పాల్పడుతున్నారు. తప్పుడు అగ్రిమెంట్‌ స్పష్టించి తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. కరోనాకు సంబంధించి ఎనిమిది మంది బాధితులు ఉన్నారని, టీడీపీ మాజీ కార్పొరేటర్‌ నుంచి రూ.8.50 లక్షలు రావాల్సి ఉందని న్యాయం చేయాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement