మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని అగౌరపరిచేందుకే బాబు కుట్ర కౌన్సిల్ జోలికి చంద్రబాబు ఎందుకు వెళ్లటంలేదు
బాపట్ల: అమరావతే రాజధాని అంటూ మూడోసారి తీర్మానం చేయటం చూస్తుంటే చంద్రబాబు ప్రజలను ఏవిధంగానైనా మోసం చేయగలరని మరోసారి నిరూపితమైందని మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి పేర్కొన్నారు. సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కోన రఘుపతి మాట్లాడారు. అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించే ఉద్దేశంతో హడావిడిగా శాసనసభ ఏర్పాటుచేసి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని అగౌరపరిచే విధంగా మాట్లాడించటం బాధాకరమన్నారు. శాసనమండలిలో తగినంత బలం లేకపోవటంతో శాసనసభలో తీర్మానం చేసి మమ అనిపించారని పేర్కొన్నారు. 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్నప్పుడు తీర్మానం చేసిన చంద్రబాబు అన్నింటిని తాత్కాలికం పేరుతో అసెంబ్లీ, పరిపాలనభవనం, హైకోర్టును ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమిటో అర్ధం కావటంలేదన్నారు. తాజాగా మరో తీర్మానం చేసి మరికొంత భూమిని కాజేసేందుకు చంద్రబాబు టీమ్ సిద్ధంగా ఉందని కోన ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలను నెరవేర్చటం చేతకాని చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను పక్కదారి పట్టించేందుకు కుటిల రాజకీయాలు చేస్తోందని విమర్శించారు.
బాపట్ల అభివృద్ధిపై
ఎమ్మెల్యే వేగేశన పెద్దవి విప్పాలి
వైఎస్సార్ సీపీ అధికారంలో ఉన్నప్పుడు బాపట్ల కేంద్రంగా జిల్లాను సాధించుకున్నామని కోన రఘుపతి గుర్తు చేశారు. ప్రస్తుతం బాపట్లలో జరుగుతున్న అభివృద్ధిపై ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ పెద్దవి విప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ అధికారంలో ఉన్నప్పుడు రూ.530 కోట్లతో మెడికల్ కళాశాలను సాధించుకున్నామని, ఇప్పుడు నిలిచిపోయిన ఆ పనులను ఏవిధంగా చేపడతారో చెప్పాలని డిమాండ్ చేశారు. సూర్యలంక ప్రాంతాభివృద్ధికి వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడే కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి రూ.100కోట్లతో ప్రతిపాదనలు పంపటం జరిగిందన్నారు. ఆ ప్రతిపాదనలపై ఇప్పుడు నిధులు విడుదల కాగా వాటిని ఏవిధంగా ఖర్చుపెడుతున్నారో బహిరంగంగా తెలియజేయాలని అన్నారు. సమావేశంలో బాపట్ల నియోజకవర్గ పరిశీలకులు జి.సురేంద్ర, రాష్ట్ర కార్యదర్శి చేజర్ల నారాయణరెడ్డి, పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు కాగిత సుధీర్‌బాబు, మరుప్రోలు ఏడుకొండలరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు కోకి రాఘవరెడ్డి, నాయకులు వడ్డిముక్కల డేవిడ్, గంగిశెట్టి రత్తయ్య, నక్కా వీరారెడ్డి, కొక్కిలిగడ్డ చెంచయ్య, ఎంపీపీ చిన్నపోతుల హరిబాబు, పిట్టు శ్రీనివాసరెడ్డి, చీరాల వెంకటేశ్వరెడ్డి, గవిని కృష్ణమూర్తి తదితరులు ఉన్నారు.


