రేపల్లె: రేపల్లె నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై నమోదవుతున్న కేసులు రాజకీయ కక్షసాధింపులేనని పార్టీ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇద్దరు కీలక నాయకులను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఒత్తిళ్లతో పోలీసులు తప్పుడు కేసులు బనాయిస్తూ వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ చిత్రాల ఓబేదు, రేపల్లె పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు ఆలా రాజ్‌పాల్‌లపై వరుసగా కేసులు నమోదు చేయడంతో పాటు రౌడీషీట్లు తెరిచి, ప్రతి వారం పోలీస్ స్టేషన్‌కు పిలిపిస్తూ విచారణ పేరుతో వేధిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇటీవల ఫ్లెక్సీల తొలగింపుపై నెలకొన్న వివాదంలో భాగంగా మున్సిపల్ కార్యాలయం వద్ద శాంతియుతంగా జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వీరిద్దరిపై బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించారంటూ ఒక్కొక్కరికి రూ.2 లక్షల జరిమానా విధించడం అధికారుల అత్యుత్సాహానికి నిదర్శనమని పేర్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా పనిచేస్తున్నారనే కారణంతోనే లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్నారని పార్టీ నాయకులు అంటున్నారు. ఎస్సీ వర్గానికి చెందిన చిత్రాల ఓబేదు గతంలో పదేళ్ల పాటు జగన్ యువజన విభాగం అధ్యక్షుడిగా సేవలందించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రాష్ట్ర హస్తకళల శాఖ డైరెక్టర్‌గా, బాపట్ల జిల్లా క్రిస్టియన్ మైనారిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా కొనసాగుతున్నారు. ఒక దళిత నాయకుడు రాజకీయంగా ఎదుగుతున్నాడనే అక్కసుతోనే టీడీపీ నాయకులు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని పార్టీ వర్గాలు విమర్శిస్తున్నాయి.
అదేవిధంగా బీసీ వర్గానికి చెందిన యువ నాయకుడు ఆలా రాజ్ పాల్ అనేక సేవా కార్యక్రమాలతో ప్రజల్లో గుర్తింపు పొందారు. కరోనా సమయంలో ‘రాజ్ పాల్ హెల్పింగ్ హ్యాండ్స్’ ద్వారా కోవిడ్ మృతులకు అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఇటువంటి నాయకులను నేరస్తులుగా చిత్రీకరిస్తూ విషం కక్కుతూ చేస్తున్న ప్రయత్నాలు బాధాకరమని పార్టీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేశాయి.
కక్ష సాధింపు చర్యల్లో భాగంగా రేపల్లె నియోజకవర్గంలో పార్టీ నాయకులపై పెట్టిన అక్రమ కేసుల విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇవన్నీ చట్టపరంగా ధైర్యంగా ఎదుర్కొంటాం. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో నియోజకవర్గ శ్రేణులకు అండగా ఉంటాను. టీడీపీ ప్రభు త్వం పోలీసులతో కలిసి ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అక్రమ అరెస్టులు చేసినా భయపడే పరిస్థితి లేదు. నిజం కోసం, ప్రజల కోసం పోరాడుతున్నాం. ఈ పోరాటంలో ఎలాంటి వెనకడుగు వేయం. రేపల్లె నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్తకు హామీ ఇస్తున్నాను. పార్టీ కోసం, ప్రజల కోసం కష్టపడుతున్నంత వరకు, నేను ఎప్పుడూ అండగా ఉంటాను.
– పీటా నాగమోహన్‌కృష్ణ,
వైఎస్సార్ సీపీ రేపల్లె సమన్వయకర్త


