రాజధానిలో నిబంధనలకు మంగళం
తాడికొండ: రాజధాని ప్రాంతంలో ఇప్పట వరకు భూముల వ్యవహారాలు, వివాదాలే చూసిన స్థానికులకు ఇప్పుడు ఇది కాస్తా వ్యాపారాలకు కూడా పాకడంతో ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు. పనుల్లేక సామాన్యులు చిన్నపాటి బడ్డీ కొట్టును జీవనం సాగించేందుకు కుటుంబాన్ని సాకుతుంటే ఆఘమేఘాలపై వచ్చి కూలదోసే అధికారులు ఏకంగా రెసిడెన్షియల్ కోసం కేటాయించిన ప్లాట్లలో కమర్షియల్ వ్యాపారానికి ఎంచక్కా అనుమతులివ్వడం విశేషం. అది ఎక్కడో మారుమూలన అనుకుంటే పొరబాటే రాజధాని నడిబొడ్డున ఏపీ సచివాలయం, అసెంబ్లీకి వెళ్లే వెలగపూడి, తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్ మలుపులో ఏకంగా బార్ అండ్ రెస్టారెంట్‌ను ఏర్పాటు చేసుకునేందుకు గేట్లు బార్లా తెరవడంతో గంటల వ్యవధిలో కంటెయినర్‌ను తెచ్చిపెట్టి విద్యుత్ సౌకర్యంతో సహా ఇచ్చి బార్ అండ్ రెస్టారెంట్‌ను ప్రారంభించారు. మంగళగిరి ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారికి చినబాబు ఆశీస్సులతో రాజధానిలో బార్ అండ్ రెస్టారెంట్‌ను కేటాయించారని, దీంతో ఆయన నిబంధనలకు విరుద్దంగా కమర్షియల్ ప్లాట్లలో దుకాణం ప్రారంభించడం ఎంతవరకు సమంజసం అని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకొని నివాస ప్రాంతాల్లో అక్రమంగా ఏర్పాటు చేసిన వ్యాపారాన్ని తొలగించి నిబంధనల ప్రకారం ఏర్పాటు చేసుకోవాలని పలువురు రాజధాని వాసులు కోరుతున్నారు.
మోడల్ స్కూల్స్ ఉద్యోగులకు వయోపరిమితి పెంపు వర్తింపజేయాలి
కారెంపూడి: ఏపీ మోడల్ స్కూల్స్‌లో అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్న ఉద్యోగులకు సైతం వయోపరిమితిని 62 ఏళ్లకు పెంచాలని అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘ అమరావతి జేఏసీ అధ్యక్షుడు వినుకొండ పేరయ్య తదితరులు ఆదివారం ఒక ప్రకటనలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం అన్ని రంగాల ప్రభుత్వ సంస్థల్లో పని చేస్తున్న వారి వయోపరిమితిని 60 నుంచి 62 ఏళ్లకు పెంచిందని, అయితే ఏపీ మోడల్ స్కూల్స్‌లో పని చేస్తున్న ఉద్యోగులను మాత్రం మరచిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఏపీ మోడల్ స్కూల్స్‌లో పని చేస్తున్న వారికి కూడా వయోపరిమితి పెంపు వర్తింపచేయాలని కోరారు.


