తెనాలిటౌన్: వందలాది సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ బాలకోటేశ్వరస్వామి దేవస్థానం గోవాడ తిరునాళ్ల ప్రాశస్త్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తుందని గోవాడ మహాశివరాత్రి పరిరక్షణ కమిటీ సభ్యులు ఆరోపించారు. స్థానిక కొత్తపేటలోని పెన్షనర్స్ హాల్‌లో ఆదివారం పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. కమిటీ కన్వీనర్ దర్శి శివకోటేశ్వరరావు మాట్లాడుతూ తెనాలి దగ్గరలోని గోవాడ శివాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు రెండు తెలుగురాష్ట్రాల నుంచి ఈ తిరునాళ్ళకు లక్షల సంఖ్యలో వస్తారని చెప్పారు. ఆలయ సమీపంలోని గోవాడ నుంచి కావూరు డొంకలో ఉత్సవం కోసం నిర్దేశించిన స్థలంలో ప్రభుత్వం ఎంఎస్‌ఎంఈ పార్కుకు స్థలం కేటాయిస్తూ ఏపీఐఐసీ వారికి స్థలం అప్పగించడం దుర్మార్గమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూవుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలంటే కేటాయింపులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 1943 నుంచి అనేకసార్లు ఈ స్థలాన్ని వేరేవారికి కేటాయించగా బ్రిటిష్ ప్రభుత్వం ఈ ఉత్సవ విశిష్టతను తెలుసుకుని కేటాయింపులు రద్దు చేసినట్లు గుర్తు చేశారు. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే, తహసీల్దార్ ఈ స్థలం కేటాయింపునకు ప్రాధాన్యం కనబరుస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో తుమ్మల జగదీష్, మండవ మల్లీశ్వరి, కెవి సత్యనారాయణ, వేదాంతం ఫణీంద్ర, కె.వాసుదేవనాయుడు, కడియాల నంద కిషోర్, బసవపున్నయ్య, ఆర్.శివశంకరరావు, రాజేష్ పాల్గొన్నారు.


