వాడరేవు – పిడుగురాళ్ల జాతీయ రహదారిపై నిత్యం ప్రమాదాలు వాహనదారుల ప్రయాణంతో రక్తసిక్తంగా మారుతున్న రోడ్డు హెచ్చరిక బోర్డులు ముందుగానే ఏర్పాటు చేయాలని డిమాండ్లు ఇంకా పలు చోట్ల మందకొడిగా కొనసాగుతున్న నిర్మాణ పనులు పలు ప్రాంతాల్లో అసంపూర్తి పనులు, డైవర్షన్లతో ప్రమాదాలు
హెల్మెట్ లేకుండా ప్రయాణించొద్దు
జాతీయ రహదారి మృత్యుమార్గంగా మారింది. ప్రారంభానికి ముందే ప్రయాణికుల ప్రాణాలను బలి తీసుకుంటోంది. వాడరేవు – పిడుగురాళ్ల 167ఏ జాతీయ రహదారిపై నిత్యం జరుగుతున్న ప్రమాదాల్లో ప్రజల ప్రాణాలు గాలిలో కలిసి పోతున్నాయి. వాస్తవానికి ఈ రహదారి ఇంకా ప్రారంభం కూడా కాలేదు. అక్కడక్కడ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. వాహనదారులు మాత్రం ప్రయాణం చేస్తుండటంతో హెచ్చరిక బోర్డులు లేని కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు.
కారంచేడు: చీరాల ప్రాంతంలోని సముద్ర తీరంగా పేరుగాంచిన వాడరేవు నుంచి కారంచేడు, పర్చూరు, చిలకలూరిపేట, నరసరావుపేట, నకిరికల్లు, పిడుగురాళ్ల మీదుగా తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ వరకు ఈ జాతీయ రహదారి ఉంది. పనులు ఇంకా కొనసాగుతున్నాయి. వాడరేవు నుంచి చిలకలూరిపేట వరకు నిర్మాణ పనులు చాలా వరకు పూర్తి చేశారు. చీరాల ప్రాంతంలోని రైల్వే లైన్‌పై నిర్మాణం చేయాల్సిన ఆర్‌ఓబీ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఇవి ఇంకా పూర్తిస్థాయిలో చేయాల్సి ఉంది. పర్చూరు సమీపంలోని ఉప్పుటూరు, నాగులపాలెం సమీపంలోని సర్వీస్ రోడ్లు, కల్వర్ట్‌ల నిర్మాణం కూడా ఇంకా సాగుతూనే ఉంది. గత ఏడాది వచ్చిన భారీ వరదలతో జాతీయ రహదారి పనుల సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో పొలాల మీదకు నీరు వచ్చింది. అప్పుడు రైతులు, ఆ ప్రాంత ప్రజల ఆవేదనను గమనించిన బాపట్ల కలెక్టర్ డాక్టర్ వి. వినోద్‌కుమార్ వెంటనే స్పందించి ఘటన స్థలాన్ని పరిశీలించారు. జాతీయ రహదారిని అడ్డంగా పొక్లెయిన్‌లతో తవ్వించి వరద గ్రామాలను ముంచెత్తకుండా చర్యలు తీసుకున్నారు. వరదలు తగ్గినా ఇంత వరకు జాతీయ రహదారిని తవ్వించిన ప్రాంతాల్లో నేటికీ పనులు మందకొడిగానే సాగుతున్నాయని ఆ ప్రాంత ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ పనుల వలన ఈ రహదారిపై వాహనాలను డైవర్షన్ ఇచ్చి ఎదురెదురుగా వచ్చే వాహనాలు సైతం ఒకే మార్గంలో ప్రయాణించాల్సి వస్తుందని కూడా వాపోతున్నారు. ఇలాంటి సమయాల్లో తెలంగాణతోపాటు ఏపీలోని ఇతర ప్రాంతాల నుంచి సముద్ర తీర ప్రాంతాలకు విడిది కోసం వచ్చే ప్రయాణికులు పలు ప్రమాదాలకు గురవుతున్నారు. పండుగ సమయాల్లో, శని, ఆదివారాలలోనూ యాత్రికులు ఎక్కువగా ఈ ప్రమాదాలకు గురవుతున్నారు.
టోల్‌గేట్‌తోనూ తప్పని అవస్థలు
ఈ జాతీయ రహదారిలో ఇంకా అనేక పనులు జరగాల్సి ఉంది. ప్రయాణికుల సౌలభ్యం కోసం రహదారులు అందుబాటులో ఉంచారు. అయినప్పటికీ ఉప్పుటూరు వద్ద ఏర్పాటు చేసిన టోల్ ప్లాజా వద్ద టోల్ వసూలు చేస్తుండటం గమనార్హం. ఇటీవల ప్రయాణికులు, సమీప గ్రామాల ప్రజలు దీనికి నిరసనగా రహదారిపై ధర్నా చేశారు. టోల్‌ప్లాజా ఏర్పాటు చేసిన ప్రాంతం నుంచి సమీపంలోని 20–30 కిలోమీటర్ల దూరంలో నివాస గ్రామాల వాహనదారులకు పాస్‌లు కూడా ఇవ్వలేదు. సంబంధిత నేషనల్ హైవే అథారిటీ అధికారులు ఈ విషయంపై దృష్టి సారించి వాహన యజమానులకు పాస్‌లు మంజూరు చేయాలని వారు కోరుతున్నారు.
వాడరేవు – పిడుగురాళ్ల జాతీయ రహదారిపై ప్రయాణించే ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణించాలి. ఇప్పటికే అనేక మార్లు ఈ రహదారిలో ప్రయాణించే వాహనదారులకు అవగాహన కల్పించాం. కార్లు, జీపులు వంటి వాహనాల డ్రైవర్లు తప్పకుండా సీట్ బెల్ట్ పెట్టుకోవడంతోపాటు పరిమిత వేగంతోనే ప్రయాణించాలి. అనేక మందికి జరిమానాలు విధిస్తున్నాం. అయినా ప్రజల్లో చైతన్యం పెరగాల్సి ఉంది.
– షేక్ ఖాదర్‌బాషా, ఎస్‌ఐ, కారంచేడు


