వైఎస్సార్ సీపీ ముస్లిం మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షురాలు నసీరున్నీసా బేగం
రేపల్లె: ముస్లిం మైనార్టీలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దగా చేస్తున్నారని వైఎస్సార్ సీపీ ముస్లిం మైనార్టీ విభాగం బాపట్ల జిల్లా అధ్యక్షురాలు నసీరున్నీసా బేగం అన్నారు. పట్టణంలోని తన క్యాంప్ కార్యాలయంలో గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ముస్లిం మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రకటనలు మోసపూరితమన్నారు. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా బ్యాంకు లింకేజీ రుణాలు అందించి ముస్లింలను ఆదుకునేందుకు రూ.173.57 కోట్లు కేటాయించినట్లు గత ఏడాది ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించి నేటి వరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేసిన దాఖలాలు లేవన్నారు. ఇటీవల గుంటూరులో జరిగిన ఇఫ్తారు విందులో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు బూటకపు మాటలు చెబుతున్నారని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిననాటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా 33,275 మందికి మైనార్టీ కార్పొరేషన్ ద్వారా రూ.193 కోట్ల రుణాలు అందిచినట్లు ప్రకటించి ముస్లిం సమాజాన్ని మోసగిస్తున్నారన్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నేటి వరకు ఒక్క రూపాయి కూడా కేటాయింపు లేదని, అంతమందికి ఎక్కడ కేటాయింపులు చేశారో ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి హోదాలో పదేపదే అవాస్తవాలు చంద్రబాబు చెబుతున్నా తెలుగుదేశం పార్టీలోని ముస్లిం మైనార్టీ నాయకులు ప్రశ్నించకపోవటం మైనార్టీలను మోసగించటమేనన్నారు. ఇప్పటికై నా పార్టీలకు అతీతంగా చంద్రబాబు ప్రకటనలను ప్రశ్నించి ముస్లిం సమాజానికి న్యాయం జరిగేలా పోరాడాలని ఆమె పిలుపునిచ్చారు.


