ఫిషింగ్ హార్బర్ నిర్మాణం ఎప్పుడు బాబూ!
ముఖ్యమంత్రి చీరాల పర్యటన మళ్లీ రెండవసారి రద్దు
చీరాల అర్బన్: ఈ నెల 28వ తేదీన జరగాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు చీరాల పర్యటన రద్దయింది. ఈ మేరకు కలెక్టర్ వి.వినోద్‌కుమార్ బుధవారం ప్రకటించారు. 28వ తేదీన ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఉన్నందున సీఎం పర్యటన రద్దయినట్లు కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో చంద్రబాబు దృష్టికి తమ సమస్యలను తీసుకెళ్లాలనుకున్న వారికి నిరాశ మిగిలింది. ఈ క్రమంలో తమ అవినీతి బండారం బయట పడుతుందేమోనని ఆందోళన చెందుతున్న వారిలో ఆనందం కనిపిస్తోంది.
రెండో పర్యాయం రద్దు
గత ఎన్నికల్లో అధికారం చేపట్టిన తరువాత చంద్రబాబు చీరాల పర్యటన రద్దు కావడం ఇది రెండో పర్యాయం. 2024 ఆగస్టులో చేనేత దినోత్సవ కార్యక్రమాన్ని చీరాల మండలం జాండ్రపేట (దేవాంగపురి) హైస్కూల్లో ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరవుతానని ప్రకటించారు. అయితే ఆ రోజు వర్షంతో వాతావరణం అనుకూలించలేదని సీఎం పర్యటనను రద్దు చేసినట్లు ప్రకటించారు.
ఏడాదికి రూ.25 వేలు ఎప్పుడో?
గత ఎన్నికల ప్రచారంలో మగ్గం ఉన్న చేనేత కుటుంబాలకు ఏడాదికి రూ.25 వేలు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని చంద్రబాబు నమ్మబలకడంతో వారు నమ్మారు. తొలి ఏడాది అమలు చేయలేదు. రెండో ఏడాది అమలు కాలేదు.
– ఇదిలా ఉంటే గత అసెంబ్లీ సమావేశాల్లో ఉపవృత్తుల వారికి కూడా మగ్గం ఉన్న వారితో సమానంగా లబ్ధి చేకూరే విధంగా చర్యలు చేపడతామని మంత్రి సవిత చెప్పారు. అవేమీ అమలు కాలేదు. దీంతో చీరాల పర్యటనకు వస్తున్న చంద్రబాబుకు నేతన్నలు తమ గోడును నేరుగా వెళ్లబోసుకుందామని అనుకున్నారు. టెక్స్‌టైల్ పార్కు విషయం ప్రస్తావించాలని భావించారు.
అవినీతిపరుల్లో ఆనందం ...
ప్రధానంగా రేషన్ మాఫియా, ఇసుక అక్రమ రవాణా, అనధికారిక లేఅవుట్లు, పైరవీలు చేసేవారు. వారికి కొమ్ము కాస్తున్న వారు సీఎం పర్యటన ప్రకటన విడుదలైన రోజు నుంచి ఆందోళనలో ఉన్నారు. ఎక్కడ తమ అవినీతి బాగోతాల గుట్టును రట్టు చేసే విధంగా ఎవరు ఏ విధంగా స్పందిస్తారోనని మల్లగుల్లాలు పడుతున్నారు. అయితే సీఎం పర్యటన రద్దు కావటంతో వారు ఆనంద పడుతున్నారు. ఇక నియోజవకర్గ సమస్యలను, అవినీతికి పరాకాష్టగా మారిన అంశాలను, పార్టీ స్థితిగతులు, భవిష్యత్ కార్యాచరణపై సూచనలు చేద్దామనుకున్న వారు పర్యటన రద్దుతో చాలా బాధపడుతున్నారని స్థానికులు చెప్పుకుంటున్నారు.
స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు పర్యటనను చీరాల మండలం వాడరేవులో ఖరారు చేశారు. ఈ క్రమంలో మత్స్యకారులు తమ సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాలని భావించారు. ప్రధానంగా వాడరేవు తీరంలో ఫిషింగ్ హార్బర్‌ను ఎప్పుడు నిర్మాణం చేస్తారనే విషయంలో స్పష్టత కోరాలని తలచారు. హార్బర్ నిర్మాణం పూర్తయితే తమకు ఒనగూరే ప్రయోజనాలను వివరించాలని భావించారు. అయితే పర్యటన రద్దు కావటంతో తమ ఆలోచనలు ఆవిరయ్యాయని బాధ పడుతున్నారు.


