పైసా మే..పాస్‌ | - | Sakshi
Sakshi News home page

పైసా మే..పాస్‌

Mar 26 2026 7:43 AM | Updated on Mar 26 2026 7:43 AM

రూ.కోట్లలో బీఈడీ కళాశాలల వసూళ్లు పరీక్ష లేకుండానే ఉత్తీర్ణతతో పోయిన పరువు ఏఎన్‌యూ అధికారుల తీరు అభాసుపాలు

తరగతులకు హాజరు కాకుండానే కేవలం పరీక్ష రాస్తే చాలు బీఈడీ సర్టిఫికెట్‌ ఇస్తారంటూ దేశవ్యాప్తంగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరువు పోయింది. పైసలిస్తే చాలు ప్రాక్టికల్‌ రాయకుండానే పాస్‌ అనే తీరులో మరోసారి అభాసుపాలైంది. బీఈడీ ప్రాక్టికల్స్‌ పేరిట ఏఎన్‌యూలో రూ.కోట్ల విద్యావ్యాపారం జరిగింది. బీఈడీ కళాశాలలు రూ.లక్షలు విరజిమ్మి... లక్ష్యం నీరుగార్చారు.

సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఏఎన్‌యూ పరిధిలో 2024– 26 బీఈడీ విద్యాసంవత్సర ప్రాక్టికల్‌ పరీక్షలు మార్చి 10 నుంచి 25వ తేదీ వరకు మూడు విడతలలో నిర్వహించారు. దాదాపు 7 వేల మంది విద్యార్థులు హాజరు కావలసిన ఈ పరీక్షలలో 4500 నుంచి 5000 మంది ఇతర రాష్ట్రాలవారే. తెలంగాణ, ఒడిశా, అసోం, మిజోరాం, వెస్ట్‌ బెంగాల్‌ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు గైర్హాజరయ్యారు. పరీక్షకో రేటు నిర్ణయించి వసూలు చేశారు. 50 మార్కుల పరీక్షకు 49గానీ, 50గానీ మార్కులు వేసి ఏఎన్‌యూని మరోసారి భ్రష్టుపట్టించారు.

విచ్చలవిడిగా ధనార్జన

ఏఎన్‌యూ పరిధిలోని 60కి పైగా కళాశాలల్లో అనేకమంది విద్యార్థుల నుంచి రూ.లక్షల్లో దోచుకున్నారు. ఒక్కో విద్యార్థికి రూ.10 వేల నుంచి రూ.12 వేల చొప్పున ఒక సిండికేట్‌ కళాశాలకు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఇలా వసూలు చేసినట్లు సమాచారం. బీఈడీ ప్రాక్టికల్స్‌ పేరిట విద్యా వ్యాపారం రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు జరిగిందని పల్నాడులోని ఓ కళాశాల కరస్పాండెంట్‌ తెలిపారు. పల్నాడులోని ఒక ప్రిన్సిపాల్‌, నర్సరావుపేటలోని ఒక లెక్చరర్‌, కళాశాల నుంచి కలెక్షన్‌ చేసే ఏజెంట్లుగా వ్యవహరించారు. వీరు అనధికారికంగా యాజమాన్యాలను బెదిరించి మరో రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేసుకున్నారు. కొన్ని సంవత్సరాలుగా వీరే దళారులుగా వ్యవహరిస్తున్నారు. ఒక్కో ఎగ్జామినర్‌కి రోజుకి రూ.2 వేల నుంచి రూ.2,500 చొప్పున కొన్ని కళాశాలలు చెల్లించాయి. గైర్హాజరైన ప్రతి విద్యార్థికి రూ. 500 అదనంగా కొందరు చెల్లించారు. ప్రాక్టికల్‌ ఫీజ్‌ పేరిట కొన్ని కళాశాలల్లో రూ.2,000 నుంచి రూ.5,000 వసూలు చేశారు. మెయింటెనెన్స్‌ ఫీజు అంటూ రూ.లక్ష నుంచి రూ. 2 లక్షలు దక్షిణగా సమర్పించారు. తొమ్మిది రోజుల పరీక్షల తంతులో రూ.ఐదు కోట్ల వరకు విద్యావ్యాపారం జరిగిందని తెనాలికి చెందిన ఒక ఇంగ్లిషు లెక్చరర్‌ తెలిపారు. ఫోర్జరీ సంతకాలతో బురిడీ కొట్టించారు. వినుకొండ, తెనాలి ప్రాంతంలోని మూడు చొప్పున కళాశాలల్లో క్లర్కులు, ప్రిన్సిపల్స్‌ ఇలా ఫోర్జరీ చేసినట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. విద్యార్థుల, పరిశీలకుల సంతకాలు పోల్చి విచారణ జరిపితే అనేక మందిపై చర్యలు ఖాయమనే వాదనలు వినిపిస్తున్నాయి. సంతకాలను పోలిస్తే అవకతవకలు బహిర్గతం కానున్నాయి. మూడవ సెమిస్టర్‌ హాల్‌ టికెట్లలో విద్యార్థుల సంతకాలను ప్రాక్టికల్‌ పరీక్ష డైలీ రిపోర్టు సంతకాలతో పోలిస్తే నకిలీల గుట్టు రట్టవుతుందని తెలుస్తోంది. జిల్లా విద్యాశాఖాధికారి అనుమతితో ఎన్ని కళాశాలలు ప్రభుత్వ పాఠశాలలో పరీక్షలు నిర్వహించాయో పరిశీలిస్తే వాస్తవాలు బయటకు వస్తాయి. పల్నాడులోని ఇద్దరు అయ్యవార్ల ఫోన్‌ పేలు, కాల్‌ లిస్టులపై విచారణ జరిపితే రూ.కోట్ల కుంభకోణం వెలుగు చూడటం తథ్యమనే వాదనలు తెరపైకి వచ్చాయి. విద్యావ్యవస్థను కాసుల కోసం దిగజార్చిన వారి అక్రమాలకు కళ్లెం పడుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement