ఉపాధి కష్టాలు | - | Sakshi
Sakshi News home page

ఉపాధి కష్టాలు

Mar 26 2026 7:43 AM | Updated on Mar 26 2026 7:43 AM

● కూలీలకు కనీస వసతులు కరువు ● ఎండ వేడిమిలో అల్లాడుతున్న పల్లె జనం ● తక్కువ మందికే పనుల కేటాయింపులు ● ఉపాధి హామీలో పాలకుల నిర్లక్ష్యం ఖాతాల్లో నగదు చెల్లింపులు

వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకంలో కూలీలకు కనీస వసతులు కరువయ్యాయి. మరోవైపు ఈ పథకం రద్దు చేసి కొత్తగా వీబీ జీ రాంజీ ప్రవేశపెట్టాలని కేంద్రం తీసుకున్న చర్యలకు నిరసనగా ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ మాత్రం ఖాతరు చేయడం లేదు.

చీరాల టౌన్‌: ఉపాధి హామీ కూలీలకు ఓ వైపు భానుడు ఉగ్రరూపం దాల్చి విపరీతంగా ఎండలు కాస్తున్నా తాగేందుకు నీరు, పనిప్రదేశంలో టెంట్లు, ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్లు అందుబాటులో ఉంచడం లేదు. ఎండలో చెమటోడ్చి పనిచేసినా ఎప్పుడు కూలీ డబ్బు అందుతుందో తెలియడం లేదు. డబ్బు విడుదలలో జాప్యం కావడంతో జాబ్‌కార్డులు ఉన్నా పనులకు వచ్చేందుకు కూలీలు అయిష్టత చూపుతున్నారు. చీరాల మండలంలోని 15 పంచాయతీల్లో 8,823 జాబ్‌కార్డులు ఉన్నాయి. అధికారుల లెక్కల్లో మాత్రం 5,036 మంది ఉపాధి కూలీలు ఉన్నారు. వీటిలో 2,381 మంది కూలీలకే పని కల్పిస్తున్నారు. మండలంలోని 11 గ్రామ పంచాయతీల్లో పనులు జరుగుతున్నాయి. కేవలం గ్రామాల్లో పంటకాలువల పూడికతీత మాత్రమే నిర్వహిస్తున్నారు. రోజూ ఉదయం 6 నుంచి 11 గంటల వరకు పని చేసిన శ్రామికులకు రోజు కూలీ రూ.307గా నిర్ధారించారు. కొలతల్లో తేడాలు, ఇతరత్రాల పేరుతో శ్రామికులు ఒక్కొక్కరికి రొజుకు చెల్లింపు చేస్తోంది రూ.278 మాత్రమే. కూలీలకు సంబంఽధించిన డబ్బు వారి బ్యాంకు అకౌంట్లలో జమ అవుతుందని చెబుతున్నా కొద్ది నెలలుగా డబ్బులు సక్రమంగా పడటం లేదు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ.6 కోట్ల ఉపాధి పనులను అధికారులు గుర్తించారు. 2026 మార్చి 31 కల్లా ఉపాధి శ్రామికులకు 2.10 లక్షల పనిదినాలు కల్పించాల్సి ఉంది. కేవలం 1.7 లక్షల పనిదినాలను మాత్రమే కల్పిస్తున్నారు. ఉపాధి పని చేసిన కూలీలకు వారానికి చొప్పున బిల్లుల రూపంలో పంపినా కూలీల బ్యాంకు ఖాతాల్లో సక్రమంగా జమ కావడం లేదు. ఈ కారణంతో కూడా కొంతమంది పనులకు రావడంలేదని అధికారులు చెబుతున్నారు.

ఓఆర్‌ఎస్‌, మజ్జిగ ప్యాకెట్లు ఇస్తారా?

పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడంతో ఉదయం 6 నుంచి 11 గంటల వరకు మాత్రమే పనులు చేపడుతున్నారు. కూలీలకు మౌలిక వసతులు కల్పించడం లేదు. ఈ ఏడాది మాత్రం కూలీలకు మజ్జిగ అందించేందుకు నిధులే రాలేదు. టెంట్లు కూడా వేయడం లేదు. కూలీలు తెచ్చుకున్నదే తింటున్నారు. తాగునీరు కూడా అందివ్వడం లేదు. కనీసం ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు ఇవ్వడం లేదు.

గతంలో పనిచేసిన ఉపాధి కూలీలకు పెండింగ్‌ బకాయిలు ప్రాధాన్యత క్రమంలో వారి ఖాతాల్లో జమ అవుతున్నాయి. ఇటీవలే ప్రభుత్వం బడ్జెట్‌ విడుదల చేసింది. ఎండ వేడికి కూలీలు జాగ్రత్తలు తీసుకోవాలని, తాగునీరు తెచ్చుకోవాలని ఆదేశించాం. మజ్జిగ పంపిణీ చేస్తారో లేదో తెలియదు. మెడికల్‌ కిట్లు పీహెచ్‌సీలోని ఏఎన్‌ఎంల నుంచి తీసుకుంటున్నాం. అందరికీ ఉపాధి పనులు కల్పించేందుకు కృషి చేస్తున్నాం.

– దాసు, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ ఏపీవో, చీరాల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement