జిల్లా అభివృద్ధికి కృషి చేయాలి | - | Sakshi
Sakshi News home page

జిల్లా అభివృద్ధికి కృషి చేయాలి

Mar 25 2026 7:06 AM | Updated on Mar 25 2026 7:06 AM

బాపట్ల: అభివృద్ధిలోనూ, అన్ని రంగాలలో బాపట్ల జిల్లా ప్రథమ స్థానంలో నిలిచేలా అధికారులందరూ కలసి కృషి చేయాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. జిల్లా అభివృద్ధి సమీక్ష కమిటీ సమావేశం మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లో జరిగింది. బాపట్ల జిల్లాలో ప్రజల తలసరి ఆదాయం బాగా పెరగడం, వ్యవసాయ ఉత్పత్తుల వృద్ధి రేటు మరింత మెరుగుపడిందని మంత్రి తెలిపారు. జిల్లాలో పంటల సాగు విస్తీర్ణం 18.75 శాతం పెరిగేలా కలెక్టర్‌ చొరవ తీసుకోవడాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ఆయకట్టు చివరి భూములకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి చెప్పారు. పంట కాల్వల మరమ్మతు, నిర్వహణ, అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 600 పనులు గుర్తించి, రూ.13 కోట్లతో ప్రతిపాదనలు పంపామన్నారు. రెవెన్యూ సమస్యలన్నీ పరిష్కరించాలి, ముఖ్యంగా 22 ఏ నిషేధిత భూముల జాబితా నుంచి పట్టా భూములను తొలగించాలని మంత్రి సూచించారు. తీర ప్రాంతాలను అనుసంధానిస్తూ జాతీయ రహదారులను నిర్మించడం ద్వారా అభివృద్ధిలో బాపట్ల జిల్లా రాష్ట్రంలోనే ప్రత్యేక స్థానం పొందనుందన్నారు. జాతీయ రహదారులపై ప్రమాదాలు జరగకుండా అధికారులు నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. వేసవిలో తాగునీటి సమస్య రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గోవా తరహాలో బాపట్ల జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని మంత్రి అనగాని సత్యప్రసాద్‌ తెలిపారు. జల జీవన్‌ మిషన్‌ పనులు వేగంగా చేపట్టాలని, రూ.117 కోట్ల నిధులు కేటాయింపునకు అసెంబ్లీలో తీర్మానం ఆమోదం పొందిందన్నారు. సమగ్ర ప్రణాళికతో పనిచేయడం ద్వారా జిల్లా ప్రజల తలసరి ఆదాయం పెరిగిందని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి. వినోద్‌ కుమార్‌ తెలిపారు. దీంతో 13వ స్థానంలో ఉన్న బాపట్ల జిల్లా ఎనిమిదవ స్థానానికి చేరిందన్నారు. వాడరేవు–పిడుగురాళ్ల జాతీయ రహదారికి సర్వీస్‌ రోడ్లు లేక ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటిని పరిష్కరించాల్సి ఉందని జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్‌ తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్‌ భావన వశిష్ఠ, డీఆర్‌ఓ జి.గంగాధర్‌ గౌడ్‌, ఆర్డీవోలు, అన్ని శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement