కారంచేడు: డీజే వ్యాన్ ఆటోను ఢీకొట్టడంతో ఒక మహిళ మృతి చెందగా మరో ఏడుగురికి గాయాలయ్యాయి. ఈఘటన ఆదివారం 167–ఏ వాడరేవు– పిడుగురాళ్ల జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. ఎస్‌ఐ ఖాదర్‌బాషా అందించిన వివరాలు.. పల్నాడు జిల్లా వినుకొండ నుంచి సౌండ్ సిస్టమ్‌తో ఉన్న వ్యాన్ చీరాల వైపు వేగంగా వెళ్తోంది. ఈక్రమంలో జే పంగులూరు మండలం రామకూరు గ్రామానికి చెందిన షేక్ కాలేషావలి, భార్య, కుటుంబ సభ్యులతో కలసి ఆటోలో చీరాల సమీపంలోని వాడరేవు బీచ్‌కు వెళ్తున్నారు. సరిగా రెండు వాహనాలు జాతీయ ప్రధాన రహదారిలో కారంచేడు– పర్చూరు గ్రామాల మధ్యకు రాగానే డీజే వ్యాన్ ముందు వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈప్రమాదంలో మొత్తం ఎనిమిది మందికి తీవ్రగాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు స్థానికుల సాయంతో చీరాల ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్య కోసం గుంటూరుకు తరలించే క్రమంలో షేక్ కాలేషా వలి భార్య హబియా(45) మృతి చెందింది. మరో ఏడుగురు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జాతీయ రహదారిపై ప్రయాణించే ద్విచక్రవాహనదారులు, ఆటోవాలాలు తమ ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలని ఎస్‌ఐ కోరారు. మితిమీరిన వేగంతో ప్రయాణించడం వలన ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
రెండు ద్విచక్రవాహనాలు ఢీ...
జాతీయ రహదారిలో మలుపు తిరుగుతున్న ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి వేగంగా వస్తున్న మరో ద్విచక్రవాహనం ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈఘటన వాడరేవు–ి పడుగురాళ్ల జాతీయ రహదారిలో కారంచేడు– చీరాల మధ్య ఆదివారం చోటుచేసుకుంది. కారంచేడు ఎస్‌ఐ షేక్ ఖాదర్‌బాషా వివరాల మేరకు.. కారంచేడుకు చెందిన కొర్రపాటి వెంకటేశ్వరరావు మరొక వ్యక్తితో కలసి యద్దనపూడి మండలం పూనూరు వెళ్లి తిరిగి కారంచేడుకు వస్తున్నారు. ఈ క్రమంలో కారంచేడు కొమ్మమూరు కాలువ కట్ట సమీపంలో రోడ్డు మలుపు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. సరిగా అదే పర్చూరు వైపు నుంచి చీరాల వైపు వస్తున్న పూర్ణచంద్రరరావు తన బైక్‌తో వేగంగా ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో మలుపు తిరగుతున్న వెంకటేశ్వరావు తలకు తీవ్రమైన గాయం కావడంతో అక్కడకక్కడే మృతి చెందాడు. అదే వాహనంపై ఉన్న మరో వ్యక్తికి కూడా గాయాలవడంతో అతనిని చీరాల ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతదేహాన్ని చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించామని చెప్పారు.
హోటల్ సామగ్రి తీసుకొస్తుండగా..
ముందు వెళ్తున్న బైక్‌ను వెనుక నుంచి మరో ద్విచక్రవాహనం ఢీకొట్టడంతో ఒక వ్యక్తి మృతి చెందగా, ఇద్దరికి గాయాలయ్యాయి. ఈఘటన చీరాల–కారంచేడు రొంపేరు కుడి కాలువ వద్ద ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. యద్దనపూడి మండలం పూనూరు గ్రామానికి చెందిన చొప్పరపు శ్రీనివాసరావు (50) కొన్నేళ్లుగా కారంచేడు గ్రామంలో నివాసం ఉంటున్నాడు. కారంచేడు యూనియన్ బ్యాంక్ సమీపంలో హోటల్ పెట్టుకొని జీవనం సాగిస్తుంటాడు. ఆదివారం శ్రీనివాసరావు హోటల్‌కు అవసరమైన సామగ్రిని కొనుగోలు చేయడానికి చీరాలకు వెళ్లి వస్తున్నాడు. ఈక్రమంలో కారంచేడుకు చెందిన మరో వ్యక్తి తన బైకుతో ముందు వెళ్తున్న శ్రీనివాసరావు బైకును ఢీకొట్టాడు. దీంతో శ్రీనివాసరావు అక్కడికక్కడే మృతి చెందగా, వెనక కూర్చొన్న మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ఢీకొట్టిన వ్యక్తి కూడా తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో వారిని చీరాల ఆస్పత్రికి తరలించారు.
11 మందికి గాయాలు


