ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా దుర్ఘటన
ప్రమాదంలో మరో ఇరువురికి గాయాలు
నగరం: అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమారుడిపై కళ్లెదుటే లారీ ఎక్కడంతో తల పగిలి మెదడు బయటకు వచ్చిన దృశ్యాన్ని చూసి కన్నతల్లి తల్లడిల్లిపోయింది. ఈ విషాద ఘటన ఆదివారం మండలంలోని శివంగులపాలెం జాతీయ రహదారి వద్ద జరిగింది. స్థానికులు, ఎస్‌ఐ బండ్ల భార్గవ్ కథనం ప్రకారం... మండలంలోని మంత్రిపాలెం శివారు బొడ్డువారిపాలెం గ్రామానికి చెందిన చెరుకూరి రాజేశ్వరావు, సుజిని దంపతులు. వారు తమ కుమారుడు దినేష్(13), కుమార్తెతో కలసి ద్విచక్ర వాహనంపై భట్టిప్రోలు వెళుతున్నారు. అదే సమయంలో వెనుక నుంచి అతివేగంతో వస్తున్న లారీ వారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో దినేష్ తలపై నుంచి లారీ టైరు వెళ్లడంతో తల ఛిద్రమై మెదడు బయటకు వచ్చి అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో రాజేశ్వరావుకు తీవ్ర గాయాలయ్యాయి. కుమార్తె కూడా గాయాలపాలైంది. కుమారుడి మృతదేహం వద్ద తల్లి రోదిస్తున్న తీరు చూపరులను సైతం కంటతడి పెట్టించింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. దినేష్ మృతదేహానికి పోలీసులు పోస్ట్‌మార్టం నిమిత్తం రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. గాయాలపాలైన వారిని తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ భార్గవ్ తెలిపారు.
ప్రమాదాలతో భయాందోళన..
గత రెండు రోజుల క్రితం ఇదే ప్రాంతంలో పీటా గోపాలం ద్విచక్రవాహనంపై వెళుతున్న సమయంలో అంబులెన్స్ ఢీకొనడంతో మృతి చెందాడు. ఆదివారం అదే ప్రాంతంలో లారీ ఢీకొని బాలుడు మృతి చెందడంతో స్థానికులు భయాందోళనలు చెందుతున్నారు .వరుస ప్రమాదాల నేపథ్యంలో ఈ ప్రాంతంలో హెచ్చరికల బోర్డులు పెట్టించాలని, ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


