కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు జిల్లాలో శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు అత్యధికంగా గుంటూరు పశ్చిమలో 20.2 మిల్లీ మీటర్ల వర్షం కురవగా, అత్యల్పంగా ప్రత్తిపాడు మండలంలో 2 మి.మీ. వర్షం కురిసింది. సగటున 5.6 మి.మీ. వర్షపాతం నమోదైంది. వివిధ మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. తాడికొండ మండలంలో 17.4 మి.మీ., పెదకాకాని 13.6, గుంటూరు తూర్పు 11.2, తుళ్లూరు 8, మంగళగిరి 7.8, దుగ్గిరాల 3.4, మేడికొండూరు 3.4, తాడేపల్లి 3.2, చేబ్రోలు 3, వట్టిచెరుకూరు 3, తెనాలి 2.6, కొల్లిపర మండలంలో 2.5 మి.మీ చొప్పున వర్షం కురిసింది. జిల్లాలో మార్చి 22వ తేదీ నాటికి సాధారణ వర్షపాతం 7 మి.మీ. కురవాల్సి ఉండగా, ఇప్పటి వరకు 17.6 మి.మీ. వర్షపాతం నమోదైంది.
గుంటూరు ఎడ్యుకేషన్ :ఏపీటీఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా గుడిపాటి దాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం జిల్లా కోర్టు వద్ద ఉన్న ఏపీటీఎఫ్ జిల్లా కార్యాలయంలో జరిగిన సంఘ జిల్లా కార్యవర్గ సమావేశంలో పెదనందిపాడు మండలం గోగులమూడి జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ హిందీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న గుడిపాటి దాస్‌ను ఎన్నుకున్నారు. 11 ఏళ్లుగా సంఘ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించిన కె.బసవ లింగారావు ఇటీవల రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై న నేపథ్యంలో జిల్లా అధ్యక్షుడి స్థానాన్ని భర్తీ చేశారు.
డాక్టర్ కొంగర శ్రీకాంత్
గుంటూరు మెడికల్: ఆధునిక జీవనశైలితో నేడు చిన్న, పెద్ద అనే తేడా లేకుండా చాలా మంది ఊబకాయంతో బాధపడుతున్నారని డాక్టర్ కొంగర శ్రీకాంత్ అన్నారు. ఆధునిక చికిత్సలతో జీవనశైలిలో మార్పులతో ఊబకాయాన్ని కట్టడి చేయవచ్చని తెలిపారు. ఆదివారం స్థానిక అమరావతిరోడ్‌లోని బండ్లమూడిగార్డెన్స్‌లో ఎండోలైఫ్ ఒబేసిటీ అప్డేట్ ఆధ్వర్యంలో ఊబకాయంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ అధిక బరువుతో అనేక వ్యాధులు వస్తున్నాయని, బరువు తగ్గించుకోవటం కోసం చాలా మంది అవస్థలు పడుతున్నారన్నారు. ఊబకాయంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు తాము ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. అతి తక్కువ ఖర్చుతో ఊబకాయం తగ్గించే వైద్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు. ఊబకాయాన్ని తగ్గించే మెడిసిన్ స్టాల్స్‌ను ప్రదర్శనలో ఉంచామని, అందరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా వైద్యులు అనేక మంది ఈ కార్యకమంలో పాల్గొనటం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో వైద్యులు నర్మదా, నీరజ, స్వప్న్కి, ఋషి కృష్ణ, ఐఎంఏ సభ్యులు పాల్గొన్నారు.
తాడికొండ: కవిత్వమంటే గొప్ప సామాజిక అన్వేషణ అని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ పాపినేని శివశంకర్ అన్నారు. స్థానిక పెదపరిమి మొవ్వా చిన్న బాపిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్, కేంద్ర సాహిత్య అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో ‘గ్రామ్ లోక్– యువ కవుల కోసం కవిత్వ మెలకువల’పై ఒక రోజు వర్క్‌షాప్ ఆదివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలోని యువకులు తమ చుట్టూ జరిగే సామాజిక అంశాలను అంతర్ముఖంగా దర్శిస్తూ ఆవేదన, సున్నితం, వ్యంగ్యం, చైతన్యం రగిల్చే విధంగా రాస్తూ యువకవులుగా తమను తాము తీర్చిదిద్దుకోవాలని సూచించారు. ప్రముఖ కవి కొప్పర్తి వెంకట రమణమూర్తి మాట్లాడుతూ.. పెద్దగా చదువు లేని గుర్రం జాషువా, భరద్వాజ తమ రచనల ద్వారా జాతీయ పురస్కారాలు పొందారని గుర్తు చేశారు. సభాధ్యక్షులు ఎంవీఆర్‌ఎం ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఎంవీ రామిరెడ్డి మాట్లాడుతూ దాతల సహకారంతో వృద్ధాలయాల నిర్వహణతో పాటు నిరుద్యోగ యువతకు ఉచిత భోజన వసతితో కూడిన పోటీ పరీక్షల శిక్షణ ఇస్తూ 700 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేందుకు చేయూతనందిస్తున్నామని అన్నారు. మధ్యాహ్నం నిర్వహించిన వర్క్‌షాప్‌నకు సాహిత్య అకాడమీ తెలుగు సలహా మండలి సభ్యులు వల్లూరు శివప్రసాద్ అధ్యక్షత వహించారు. అనంతరం ‘కవిత్వంలో గ్రామీణ జీవనం’ అంశంపై డాక్టర్ సుంకర గోపాల్, మందరపు హైమావతి, కోసూరి రవికుమార్‌లు విశ్లేషించారు. వర్క్‌షాప్‌నకు ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల నుంచి 50 మందికి పైగా గ్రామీణ యువకవులు, రచయితలు, రచయిత్రులు ఉత్సాహంగా హాజరయ్యారు. కార్యక్రమంలో సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి, ట్రస్టు అధ్యక్షులు మొవ్వ సాంబిరెడ్డి, కార్యదర్శి మున్నంగి శ్రీనివాసరెడ్డి, నరసింహారెడ్డి, మదన్ మోహన్ రెడ్డి, విశ్రాంత ప్రొఫెసర్ శారద తదితరులు పాల్గొన్నారు.


