అక్రమార్జన బతుకు నల్లబజారు వ్యాపారి రూటే సప ‘రేటు’ చీరాల అర్బన్: ప్రస్తుతం పలు చౌకధరల దుకాణాల్లో రిజిస్టర్‌లో ఉండాల్సిన బియ్యం కన్నా అదనంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. కార్డుదారులకు పూర్తిస్థాయిలో బియ్యం ఇవ్వకుండా డీలర్లు వివిధ రూపాల్లో బియ్యం సేకరిస్తున్నారనేందుకు ఇదొక నిదర్శనం. ఇటీవల ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడు రెవెన్యూ, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులతో కలసి అకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. 8 దుకాణాలను తనిఖీ చేస్తే అందులో 6 దుకాణాల్లో ఉండాల్సిన బియ్యం కన్నా అదనంగా ఉన్నాయి. దీంతో వారికి నోటీసులు ఇచ్చారు. తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు.
రూ.10 నుంచి కొని నల్లబజారుకు.. డీలర్లు కార్డుదారుల నుంచి కిలో బియ్యం రూ.10 నుంచి రూ.12లకు కొనుగోలు చేస్తు్‌ాన్నరు. ఒంగోలుకు చెందిన నల్లబజారు వ్యాపారి డీలర్లు నుంచి కిలో రూ.14 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. ఆ విధంగా సేకరించిన బియ్యాన్ని అతనికి అనుకూలమైన మిల్లులకు, పోర్టులకు తరలిస్తాడు. అక్కడ అతనికి కిలోకి రూ.19 నుంచి రూ.21వరకు గిట్టుబాటు అవుతుంది. అదే బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి అందమైన బ్యాగుల్లో ప్యాక్ చేసి కిలో రూ.40 నుంచి రూ.45 వరకు సొమ్ము చేసుకుంటున్నట్టు సమాచారం.
మాల్యాద్రి మాయ..
డీలర్లు తమ దుకాణాల్లోని స్టాకు రిజిస్టర్‌లో ఎంత సరుకు ఉంటుందో, అంతే సరుకు దుకాణంలో ఉండాలి. అయితే వారు వివిధ రూపాల్లో సేకరించిన బియ్యం నల్లబజారుకు తరలేలోపు అధికారులు తనిఖీలు నిర్వహిస్తే వారిపై చర్యలు తప్పవు. ఈ క్రమంలో నల్లబజారు వ్యాపారి తాను బియ్యం తరలించటంలో ఒకింత జాప్యం చేస్తాడు. వెంటనే తరలించాలంటే ఒకింత ధర తగ్గించాలని డిమాండ్ చేస్తాడు. అందుకు అనుకూలమైన డీలర్లు వత్తాసు పలుకుతారు. దానికి ఓ అధికారి పూర్తిస్థాయిలో కొమ్ము కాస్తున్నాడు. ఇదే మాల్యాద్రి మార్క్ మాయగా చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఎక్కువ దుకాణాల్లో సరుకు నిల్వలు అదనంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
తిలా పాపం.. తలా పిడికెడు బియ్యం నల్లబజారుకు తరలకుండా కార్డుదారులకు మాత్రమే అందే విధంగా తగిన చర్యలు చేపట్టాల్సిన బాధ్యత రెవెన్యూ, పోలీస్, సివిల్ సప్లయిస్, విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ తదితర శాఖలకు ఉంది. అయితే సంబంధీకులు ఆ వైపు కన్నెత్తి చూడకుండా కీలక నేత, యువనేతలకు నెలకు రూ.25 లక్షలు, సంబంధిత శాఖలకు సంబంధించిన బాధ్యులకు కూడా ఎవరి స్థాయి బట్టి వారికి నెలవారీ ముడుపులు అందుతున్నాయని చెప్పుకుంటున్నారు.
కొమ్ముకాస్తున్న ఓ కీలక అధికారి
దీర్ఘకాలంగా అటు బాపట్ల, చీరాలలో పనిచేస్తున్న ఓ కీలక అధికారి నల్లబజారు వ్యాపారికి అన్నీ తానై చూస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. నల్లబజారు వ్యాపారికి డీలరు సహకరించకపోతే అతనిపై తన అధికార దండాన్ని ప్రయోగిస్తాడు. సానుకూలంగా ఉంటే డీలరు దుకాణంలో ఉన్న లొసుగుల నుంచి బయట పడేందుకు మార్గాన్ని అతనే చూపుతాడని ప్రచారం జరుగుతోంది. దీంతో డీలర్లు అందరూ అతని కనుసన్నల్లో మెలగాల్సి వస్తోందని ప్రచారం జరుగుతోంది. అంతా శివమయం అని చెప్పుకుంటున్నారు. అతను ఉన్నంత కాలం తమకు ఎలాంటి ఇబ్బంది లేదని నల్లబజారు వ్యాపారితో, అతనికి కొమ్ముకాసే నేతలు అనటం విశేషమని చెప్పుకుంటున్నారు.
మా వంతు బాధ్యత మేం నిర్వహిస్తున్నాం..
ముగ్గురు కీలక డీలర్లదే బాధ్యత..
కార్డుదారుల నుంచి నల్లబజారు వ్యాపారికి బియ్యం కొనుగోలు చేసేందుకు డబ్బు పంపిణీ బాధ్యత ముగ్గురు కీలక డీలర్లు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. డీలరుకు ఇచ్చే ధరను కూడా వారే నియంత్రిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలో కాస్త నోరున్న డీలర్లకు, పచ్చ ముద్ర ఉన్న డీలర్లకు ఎక్కువ ధర, మిగిలిన డీలర్లుకు తక్కువ ధర ఇస్తున్నట్లు చర్చించుకుంటున్నారు.
మెతుకు మెతుకులో
నల్లబజారు వ్యాపారి రూటే సప ‘రేటు’
● ముగ్గురు కీలక డీలర్ల
ద్వారా రేషన్ బియ్యం కొనుగోలు
● కార్డుదారుల నుంచి కిలో
రూ.10/రూ.12కు కొనుగోలు
● డీలరుకు కిలోకి రూ.14 చెల్లింపు
● బ్లాక్ మార్కెట్‌లో కిలో
రూ.21కి విక్రయం
● పట్టించుకోని అధికారులు ..
● కీలక నేత, యువనేత ఆశీస్సులు
అందుకు కారణం
ఇటీవల 8 రేషన్ దుకాణాల్లో తనిఖీలు నిర్వహించాం. అందులో 6 షాపుల్లో నిల్వలు అధికంగా ఉన్నాయి. వారికి నోటీసులు ఇచ్చాం. మా పరంగా నోటీసులతో పాటు 6–ఏ కేసులు నమోదు చేశాం. మా వంతు బాధ్యత మేం నిర్వహిస్తున్నాం. రేషన్ బియ్యం నల్లబజారుకు తరలించడం నేరం. దీన్ని అరికట్టేందుకు మా వంతు ప్రయత్నం మేం చేస్తున్నాం.
– ఓంకార్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ, చీరాల