గంజాయి విక్రయించే ముఠా అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

గంజాయి విక్రయించే ముఠా అరెస్ట్‌

Feb 8 2026 4:26 AM | Updated on Feb 8 2026 4:26 AM

గంజాయి విక్రయించే ముఠా అరెస్ట్‌

గంజాయి విక్రయించే ముఠా అరెస్ట్‌

గుంటూరు రూరల్‌: గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న ముఠాను కాకుమాను పోలీసులు శనివారం అరెస్ట్‌ చేశారు. నగరంలోని సౌత్‌ సబ్‌డివిజన్‌ డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ భానోదయ తెలిపిన వివరాల ప్రకారం.. గంజాయి వినియోగం విక్రయాలకు పాల్పడుతున్న ఐదుగురు నిందితులను అరెస్ట్‌ చేసి, వారి వద్దనుంచి 3.95 కిలోల గంజాయి స్వాధీనం చేసుకోవటం జరిగిందన్నారు. జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా గంజాయి సంబంధిత అక్రమ కార్యకలాపాలను నిర్మూలించడమే లక్ష్యంగా పాత నేరస్తులు, గంజాయి కేసుల్లో పాల్గొన్న నిందితులు, ఇతర అనుమానితుల కదలికలపై జిల్లా పోలీసులు కఠిన నిఘా పెట్టి దాడులు నిర్వహిస్తున్నామన్నారు. ఈ క్రమంలో గతంలో గంజాయి కేసులో పట్టుబడి, జువైనల్‌ హోంలో ఉన్న ఓ మైనర్‌ ఇచ్చిన సమాచారం మేరకు దేవరకొండ వెంకటరంజిత్‌కుమార్‌, మరికొంత మంది గంజాయి వ్యాపారంలో పాల్గొంటున్నట్లు నిర్ధారించి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిఘా కొనసాగించామన్నారు. నిఘాలో శుక్రవారం కాకుమాను పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బాపట్ల పెదనందిపాడు రహదారిలో ఉన్న డంపింగ్‌ యార్డు వద్ద గంజాయి కార్యకలాపాలు జరుగుతున్నాయనే సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని అనుమానాస్పదంగా ఉన్న ఐదుగురు యువకులను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా, వారి వద్ద గంజాయి లభ్యమైందన్నారు. వారిని పోలీస్‌ స్టేషన్‌కు తరలించి విచారించగా, వారు విశాఖపట్నం, ఒడిశా ప్రాంతాల నుంచి గంజాయిని అక్రమంగా తెచ్చి బాపట్ల, మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు అంగీకరించారన్నారు. నిందితులు బాపట్లకు చెందిన దేవరకొండ వెంకట రంజిత్‌కుమార్‌, బాపట్లకు చెందిన జూటు చైతన్య పరమేశ్వరరావు, మచిలీపట్నంకు చెందిన జొన్నకూటి ఉదయ కిరణ్‌, బాపట్లకు చెందిన మల్లెల ఆరాధన రాజా, పొట్లూరు గణేష్‌ అలియాజ్‌ బుడ్డ గణేష్‌లను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. ఆపరేషన్‌లో పాల్గొన్న ప్రత్తిపాడు సీఐ శ్రీనివాసరావు, కాకుమాను ఎస్‌ ఏకానాథ్‌ సిబ్బంది నరసింహ, అశోక్‌, ప్రసాద్‌, శ్రీను, చిరంజీవి తదితరులను డీఎస్పీ అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement