రోడ్డు ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం
సత్తెనపల్లి: రోడ్డు ప్రమాదంలో బీఫార్మసీ విద్యార్థి మృతి చెందాడు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కంటెపూడి సమీపంలో ఈ ఘటన శుక్రవారం జరిగింది. వివరాలు.. సత్తెనపల్లి మండలం కంటేపూడి సమీపంలోని కళాశాలలో చిత్తూరు జిల్లా ఎన్‌జీ గూడెంకు చెందిన వి.భరణి (19) బీఫార్మసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు జరిగాయి. తన స్నేహితుడు దాచేపల్లికి చెందిన దాసరి గణేష్‌ను ద్విచక్రవాహనంపై ఎక్కించుకొని కొమెరపూడి వైపు వెళుతుండగా అదుపుతప్పి స్తంభాన్ని ఢీకొట్టాడు. భరణి సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. గణేష్‌కు కూడా స్వల్ప గాయాలయ్యాయి. సత్తెనపల్లి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


