యానాదులపై అధికార పార్టీ నేత అరాచకం | - | Sakshi
Sakshi News home page

యానాదులపై అధికార పార్టీ నేత అరాచకం

Jan 31 2026 6:43 AM | Updated on Jan 31 2026 6:43 AM

యానాదులపై అధికార పార్టీ నేత అరాచకం

యానాదులపై అధికార పార్టీ నేత అరాచకం

చేబ్రోలు: సిమెంట్‌ బ్రిక్స్‌లో పనిచేసే కూలీలను అధికార పార్టీకి చెందిన నాయకుడు భయపెట్టడం, బెదిరించి దాడి చేయటంపై యానాది గిరిజన సంక్షేమ సంఘం నాయకులు శుక్రవారం రాత్రి చేబ్రోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. యానాది, గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాపట్ల బ్రహ్మయ్య, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు తుపాకుల ఉమామహేశ్వరరావు, రాష్ట్ర అధికార ప్రతినిధి పొన్నూరు అంకమ్మరావు, బాపట్ల జిల్లా అధ్యక్షుడు సిరిమెళ్ల శ్రీను, ఉన్నం దుర్గారావు, నక్కా చంద్రయ్య తదితరులు చేబ్రోలు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. చేబ్రోలు మెయిన్‌ రోడ్డులో అప్పాపురం చానల్‌ సమీపంలో ఉన్న సిమెంట్‌ బ్రిక్స్‌ కంపెనీలో గత ఐదు సంవత్సరాలుగా బాపట్ల జిల్లా కొంగట్టు అడ్డరోడ్డు గాదె వెంకటరెడ్డి కాలనీకి చెందిన ఎమినిది యానాది కుటుంబాల వారు కార్మికులుగా పనిచేస్తున్నారు. రోజుకు రూ.150 చొప్పున కూలీకి పనిచేస్తున్నారు. 20 మంది ఉన్నా పది రోజులే పని ఉంటోంది.

బ్రిక్స్‌ యజమాని అధికార టీడీపీ నేత షేక్‌ హర్షద్‌బాషా సక్రమంగా డబ్బులు ఇవ్వకుండా కులం పేరుతో దూషిస్తూ, బెదిరిస్తూ, దాడి చేస్తున్నట్లు వారు ఆరోపిస్తున్నారు. గదిలోకి తీసుకువెళ్లి తమను అకారణంగా ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ పనులు లేకపోవటంతో మిరప, మినుము పీకుడు పనులకు వెళితే కూలి ఆరువందల వరకు వస్తుందని వెళితే అక్కడకు వచ్చి బెదిరించి దాడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రోజుల క్రితం మందపాడు మిరపకాయల కూలీలకు వెళ్లగా అక్కడకు కారులో మద్యం తాగిన నలుగురు వచ్చి బలవంతంగా తీసుకువచ్చారన్నారు. ఇక్కడకు తీసుకువచ్చి తమపై దాడి చేసినట్లు వారు ఆవేదన వ్యక్తం చేశారు.

బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి బాధితులకు రక్షణ కల్పించాలని యానాది, గిరిజన సంక్షేమ సంఘం నాయకులు కలిసి చేబ్రోలు ఎస్‌ఐ పి.వీరనారాయణకు ఫిర్యాదు చేశారు. సిమెంట్‌ బ్రిక్స్‌లో కూలీలుగా పనిచేసే చేగోరు సుబ్బారావు, చేగూరు రాంబాబు, బాపట్ల రాఘవులు, చూటూరి దుర్గారావు, పత్తి వెంకటేశ్వర్లు, టి. సాంబయ్య, సి.చంద్రయ్య, సీహెచ్‌ బాలులకు చెందిన కుటుంబసభ్యులతో పాటు యానాదికాలనీకి చెందిన బాధిత కుటుంబాలకు చెందిన బంధువులు, నాయకులు పాల్గొన్నారు. కేసును పక్కదారి పట్టించి బ్రిక్స్‌ కంపెనీ యజమానిని కాపాడటానికి అధికార పార్టీ నేతలు పోలీసులపై ఒత్తిడి చేస్తున్నట్లు యానాది గిరిజన సంక్షేమ సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు.

సిమెంట్‌ బ్రిక్స్‌లో పనిచేసే కార్మికులపై బలప్రయోగం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement