రైలు కిందపడి పెయింటర్ ఆత్మహత్య
సత్తెనపల్లి: కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సత్తెనపల్లి మండలం భీమవరం రైల్వే గేటు వద్ద శుక్రవారం జరిగింది. వివరాలు... పట్టణంలోని సంఘం బజార్‌కు చెందిన పెయింటర్ గైక్వాడ గోపీనాథ్ (29) మద్యం తాగుతుంటాడు. ఈ క్రమంలో భార్య పుట్టింటికి వెళ్లింది. మద్యం మానేసినప్పటికీ తిరిగి రావడం లేదని, మానసిక పరిస్థితి బాగాలేక పోవటంతో రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అల్లుడి పెద్దకర్మ సరుకులకు వెళ్తూ అత్త మృతి
సత్తెనపల్లి: అల్లుడి పెద్దకర్మ సరుకుల కోసం వస్తూ అత్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటన సత్తెనపల్లి మండలం బృగుబండ నుంచి పాకాలపాడు శివారు మార్గంలో శుక్రవారం జరిగింది. వివరాలు... క్రోసూరు మండలం గుడిపాడుకు చెందిన సిద్దిల మరియమ్మ అలియాస్ మేరమ్మ (50)కు కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమారుడు వ్యవసాయ పనులు చేస్తూ జీవనం వెళ్లదీస్తున్నాడు. కుమార్తెను సత్తెనపల్లి మండలం బృగుబండ గ్రామానికి చెందిన వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. అల్లుడు ఈ నెల 7న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ ఇటీవల మృతి చెందాడు. పెద్దకర్మకు సంబంధించిన సరుకులు కొనుగోలు చేసేందుకు శుక్రవారం తన వరుసకు చెల్లి, మరిది అయిన ఇరువురితో కలిసి మరియమ్మ ద్విచక్ర వాహనంపై సత్తెనపల్లి వస్తోంది. అదే సమయంలో మట్టి ట్రాక్టర్ పాకాలపాడు శివారు వద్ద ఢీకొంది. మరియమ్మ తలపై నుంచి ట్రాక్టరు టైర్ వెళ్లడంతో మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. సత్తెనపల్లి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
విశ్వబ్రాహ్మణల ఎదుగుదలకు కృషి
నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): విశ్వబ్రాహ్మణుల సామాజిక, ఆర్థిక, రాజకీయ ప్రగతికి పార్టీలకతీతంగా సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్‌ర్సన్ కుమ్మర పార్వతి పేర్కొన్నారు. గుంటూరు పట్టణ విశ్వబ్రాహ్మణ సమాజం ఆధ్వర్యంలో రింగ్ రోడ్డు సాయిబాబా రోడ్డులో సంఘ కార్యాలయంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పార్వతి మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణ సామాజిక ఆర్థిక ప్రగతికి విద్య బలమైన ఆయుధం అన్నారు. కుటుంబాలు తమ పిల్లలను విద్యావంతులుగా చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు కడియాల సుబ్బారావు, కార్యదర్శి వై. ధర్మారావు, నాయకులు గట్టి శ్రీనివాసరావు చిరంజీవి ఆచారి, మేడపి వెంకటప్రసాద్, బ్రహ్మముడి కోటేశ్వరరావు, సిద్ధి సాంబశివరావు, మేడూరి మల్లేశ్వరరావు, మను బ్రహ్మచారి, శివాజీ, కొమ్మూరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
రైలు కిందపడి పెయింటర్ ఆత్మహత్య


