నాలుగవ రోజుకు చేరిన సహకార ఉద్యోగుల నిరసన
కొరిటెపాడు(గుంటూరు): దీర్ఘకాలికంగా పేరుకుపోయిన వ్యవసాయ సహకార సంఘం ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గుంటూరు శ్యామలానగర్‌లోని రాష్ట్ర సహకార శాఖ కమిషనర్, రిజిస్టారు కార్యాలయం వద్ద ఏపీ వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో సహకార సంఘాల ఉద్యోగులు చేస్తున్న నిరసన, వంట–వార్పు కార్యక్రమం శుక్రవారం నాలుగవ రోజుకు చేరుకుంది. రోజుకు రెండు జిల్లాల నుంచి పీఏసీఎస్ ఉద్యోగులు పాల్గొని నిరసన, వంట వార్పు కార్యక్రమం చేపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నతాధికారులకు వ్యతిరేకంగా పలు నినాదాలు చేశారు. శుక్రవారం ఎన్టీఆర్, అనంతపురం జిల్లాలకు చెందిన పీఏసీఎస్ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు ఏపీ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ల ఐక్య వేదిక నాయకులు మాట్లాడుతూ 45 రోజులుగా పీఏసీఎస్ ఉద్యగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రూపాల్లో ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నతాధికారులు నుంచి స్పందన రాకపోవడం బాధాకరమని ధ్వజమెత్తారు. సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఆందోళన కార్యక్రమాలను కొనసాగిస్తామని హెచ్చరించారు.
కార్యక్రమంలో ఏపీ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ల ఐక్య వేదిక రాష్ట్ర నాయకులు మువ్వా వెంకటేశ్వరరావు, తోట వెంకట్రామయ్య, బి.రఘురాం, సత్యనారాయణ, ఎస్.ఖాజా మొయిద్దీన్, ప్రకాశం, చిత్తూరు జిల్లాల నాయకులు బీఎస్ విజయ్‌కుమార్ రెడ్డి, బి.రమేష్, వి.మనోజ్‌కుమార్, జి.రామాంజనేయరెడ్డి, ప్రకాశం, చిత్తూరు జిల్లాల ఉద్యోగులు పాల్గొన్నారు.
నాలుగవ రోజుకు చేరిన సహకార ఉద్యోగుల నిరసన


