ఇక కౌలుకోలేం..!
నిలదీస్తున్న కర్షకులు
పథకాలు అందటం లేదు
కార్డు ఇచ్చినా ప్రయోజనం లేదు
రాష్ట్రంలో కౌలుదారు కార్డుల జారీలో సమస్యల వలన అసలైన రైతులకు న్యాయం జరగటం లేదు. కార్డుల జారీని ప్రభుత్వం సరళతరం చేయాలి. పంట బీమా రైతులకు అదనపు భారంగా మారకుండా ప్రభుత్వమే ప్రీమియం చెల్లించాలి. పభుత్వం కౌలు రైతులను ఆదుకోవాలి.
– పి. కొండయ్య, బాపట్ల జిల్లా
కౌలు రైతు సంఘం కార్యదర్శి
మార్టూరు: ‘కౌలు రైతుకు మొదటి విడత అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ యోజన పథకం కింద రూ.7 వేలు ఇవ్వలేకపోతున్నాం. రెండో విడత పంపిణీలో రెండు కిస్తీలు కలిపి రూ.14 వేలు రాష్ట్రంలోని ప్రతి కౌలు రైతు బ్యాంకు ఖాతాలో జమ చేస్తా...’
– ఇదీ మొదటి విడత నగదు పంపిణీ సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మాట.
ఈ ప్రకటన వింటే కౌలు రైతులపై చంద్రబాబుకు ఎంత ప్రేమో అనిపిస్తుంది. కానీ వాస్తవానికి ఆయన ఏం చెప్పినా మాటల్లోనే తప్ప చేతల్లో శూన్యమని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే తెలుస్తుంది. పెట్టుబడి సాయంతోపాటు మోంథా తుఫాన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన కౌలు రైతులకు ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.
పంట బీమాలోనూ మొండిచేయి
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 85 లక్షల మంది రైతులకు ప్రభుత్వమే బీమా కంపెనీలకు ప్రీమియం చెల్లించి పంట బీమా చేయించింది. ఈ కారణంగా ప్రకృతి వైపరీత్యాల వలన నష్టపోయిన వారు పరిహారంతో ఊపిరి పీల్చుకోగలిగారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చంద్రబాబు ప్రభుత్వం బీమా మొత్తాన్ని రైతులే చెల్లించుకోవాలని పేర్కొంది. గత సంవత్సరం వచ్చిన తుఫాన్ కారణంగా ఇవ్వాల్సిన నష్టపరిహారమే ఇంతవరకు అందలేదు. అలాంటి సమయంలో రైతులకు బీమా ప్రీమియం అదనపు భారమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఏడు వేల మంది రైతులు మాత్రమే బీమా చేసుకోగలిగారు. ఇటీవల తుఫాన్ వలన తీవ్రంగా నష్టపోయిన రైతులకు బీమా పరిహారం అందే పరిస్థితి లేదు.
కన్నీటి పాలైన శ్రమ
బాపట్ల జిల్లాలో సుమారు రెండు లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. ప్రతి నియోజకవర్గానికి 30 వేల మందికి కాగా, వీరికి కౌలుదారు కార్డుల జారీలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. లక్ష మందికి కార్డులు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నా జిల్లాలోని 25 మండలాలకుగాను ఓ మండలానికి సగటున 300 కార్డులు కూడా ఇవ్వలేదు. మార్టూరు మండలంలో 3,200 కార్డులు లక్ష్యం కాగా, 796 మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. అవీ ఎక్కువగా పచ్చ పార్టీ వారికే ఇవ్వడం గమనార్హం. కార్డుల్లేని రైతులు ఈ– క్రాప్ బుకింగ్ చేయలేక పంట బీమాకు దూరమయ్యారు. సంక్షేమ పథకాలూ అందడం లేదు. బ్యాంకు రుణాలు ఇవ్వడం లేదు. ఇటీవల మార్టూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మాట్లాడుతూ పర్చూరు నియోజకవర్గంలోని 37,861 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.25.83 కోట్లు జమ చేశానని ఆర్భాటంగా ప్రచారం చేసుకోవటం గమనార్హం. 70 శాతం భూములు కౌలు రైతులే సాగు చేస్తున్న పరిస్థితిలో నిజమైన లబ్ధిదారులకు న్యాయం జరగలేదని రైతు సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. కౌలు రైతుల బ్యాంకు ఖాతాలో రెండు విడతల నగదు జమ చేస్తానని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ఏమైందని రైతులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం కౌలు రైతులను ఆదుకోవాలన్నారు.
సొంతమైన 60 సెంట్లతోపాటు గ్రామానికి చెందిన ఓ రైతు నుంచి రెండు ఎకరాలు కౌలుకు తీసుకున్నాం. మినుము పంట సాగు చేశా. తుఫాన్ కారణంగా రూ.30 వేల వరకు నష్టం వాటిల్లింది. కౌలుదారు కార్డు ఉన్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రయోజనం అందలేదు. ప్రభుత్వం కౌలు రైతులను ఆదుకోవాలి. ఇచ్చిన హామీలను నిలుపుకోవాల్సిన అవసరం ఉంది.
– కుక్కపల్లి లీలావతి, రైతు, బొల్లాపల్లి
తొమ్మిది ఎకరాలు కౌలుకు తీసుకొని ఆరు ఎకరాల్లో మినుము సాగు చేశా. తుఫాన్ కారణంగా రూ.1.20 లక్షలు నష్టం వాటిల్లింది. కౌలుదారు కార్డు అధికారులు ఇచ్చారు. ప్రభుత్వపరంగా ప్రయోజనం అందలేదు. కౌలు రైతుల పట్ల ప్రభుత్వం వివక్ష చూపకూడదు. పథకాలన్నీ అందరికీ అందించాలి. ముఖ్యంగా కౌలురైతులను ఆదుకోవాలి.
– జీడిమళ్ల ఆంజనేయులు, కౌలు రైతు, బొల్లాపల్లి
రైతుల సంక్షేమం కోసం ఎంతో చేస్తున్నట్లు ఇటీవల రైతన్నా.. నీకోసం అంటూ చంద్రబాబు ప్రభుత్వం కొత్త ప్రచారం మొదలుపెట్టింది. రైతులకు ఏదో చెప్పాలని చేస్తున్న ప్రయత్నం ఆదిలోనే బెడిసికొట్టడం గమనార్హం. రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్ గత సోమవారం సంతమాగులూరు మండలం కొమ్మాలపాడులో నిర్వహించిన కార్యక్రమంలో రైతులు తమకు అన్నదాత సుఖీభవ వంటి సాయం అందటం లేదంటూ ప్రశ్నించారు. మండలాల్లో అధికారులు, వ్యవసాయ శాఖ సిబ్బంది పరిస్థితి కూడా ఇదేవిధంగా ఉంది. మొక్కుబడిగా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అధికారులే చెప్పటం గమనార్హం.
ఇక కౌలుకోలేం..!
ఇక కౌలుకోలేం..!
ఇక కౌలుకోలేం..!
ఇక కౌలుకోలేం..!


