తూకం... మోసం.. !
కాటాలతో అక్రమాలకు పాల్పడుతున్న వ్యాపారులు
ప్రజలను బురిడీ కొట్టించి దోపిడీ
అధికారుల తూతూ మంత్రపు జరిమానాలు
ఇప్పటికై నా అరికట్టాలని ప్రజల వేడుకోలు
నరసరావుపేట టౌన్: వంట గదిలో ఉప్పు, పప్పు, కూరగాయలు ఇలా ఏ సరుకులు కావాలన్నా పక్కనే ఉన్న చిల్లర దుకాణం నుంచి లేదా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌లో కొనుగోలు చేస్తుంటాం. కొందరు పావు కిలో, కిలో ఇలా స్థోమత మేరకు సరుకులు తెచ్చుకుంటారు. ఇంకాస్త ఆర్థిక వెసులుబాటు ఉన్న వారు ఒకేసారి నెలకు సరిపడా సరుకులు కొనుగోలు చేస్తారు. ఇలా ప్రతి నెలా మధ్య తరగతి కుటుంబానికి సుమారు రూ.3 వేలు నుంచి రూ.5 వేలు ఖర్చవుతుంది. అయితే ఇలా మనం తెచ్చుకునే సరుకుల కొలత కళ్లతో చూసిందే నిజం అని నమ్ముతుంటాం. కానీ మన కళ్లను ఏమార్చి తూకాన్ని మార్చి జేబులు గుల్ల చేస్తున్నారు.
5 కిలోల సరుకు 7.50 కిలోలట..
నరసరావుపేటలో తూనికలు, కొలతల శాఖ అధికారి జె. సాయి శ్రీకర్ గత ఆదివారం స్థానిక చేపల మార్కెట్‌ను తనిఖీ చేశారు. అక్కడ ఐదు కేజీల చేపలు తూకం వేస్తే 7.50 కేజీలు చూపించాయి. దీంతో వచ్చిన అధికారులతోపాటు ప్రజలు కూడా అవాక్కయ్యారు. మార్కెట్ మొత్తం తనిఖీ చేసిన అధికారులు ఏడుగురు వ్యాపారుల వద్ద మోసాలను గుర్తించారు. దీంతో వారికి ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు జరిమానా విధించి అధికారులు చేతులు దులుపుకున్నారు.
నిలువు దోపిడీ..
ఆదివారం వచ్చిందంటే మాంసం ప్రియులు మార్కెట్‌కు క్యూ కడతారు. అక్కడ రద్దీ కారణంగా త్వరగా ఇంటికి వెళ్లేందుకు తొందర పడుతుంటారు. ఇదే అదనుగా మార్కెట్‌లో వ్యాపారులు.. ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారు. ఒక్క ఆదివారమే మార్కెట్‌లో లక్షల రూపాయల వ్యాపారం జరుగుతుంది. ఎలక్ట్రికల్ కాటాల్లో సైతం మోసాలకు పాల్పడుతున్నారు. సాంకేతికతలో లోపాలను గుర్తించిన వ్యాపారులు తూకంలో దగా చేస్తున్నారు. కేజీకి సుమారు 200 నుంచి 250 గ్రాముల వరకు వ్యత్యాసం ఉండేలా ఎలక్ట్రికల్ కాటాలో అమర్చుతున్నారు. కాటా పెట్టే సమయంలో జీరో చూపించటంతో వినియోగదారులు తూకం విషయంలో అనుమానించటం లేదు.


