
19న ‘మట్టి రంగు’ పుస్తకావిష్కరణ
బాపట్ల: ప్రముఖ కవయిత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కార గ్రహీత డా. చిల్లర భవానీదేవి రచించిన ‘మట్టి రంగు’ కవితా సంపుటి పుస్తకావిష్కరణ మహోత్సవం ఈ నెల 19వ తేదీ సాయంత్రం 6 గంటలకు స్థానిక హోటల్ గౌతం వేదిక హాలులో జరగనుంది. ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమం ఉంటుందని బాపట్ల జిల్లా రచయితల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు తిమ్మన శ్యామ్ సుందర్ తెలిపారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పాపినేని శివశంకర్ ముఖ్యఅతిథిగా పాల్గొంటారని పేర్కొన్నారు. రచయిత్రి డా. వెలువోలు నాగరాజ్యలక్ష్మి సభాధ్యక్షత వహించనున్నారని, సాహితీ విమర్శకులు డా. బీరం సుందరరావు పుస్తక పరిచయాన్ని చేస్తారని, ఆత్మీయ అతిథిగా ఫోరం ఫర్ బెటర్ కార్యదర్శి డా. పి.సి. సాయిబాబు పాల్గొననున్నట్లు ఆయన వివరించారు. ఈ సందర్భంగా కోటంరాజు సత్యనారాయణ శర్మ దంపతుల స్మారక సాహితి పురస్కారాన్ని డా. అప్పాజోస్యుల సత్యనారాయణకు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు.
‘కపాస్ కిసాన్’యాప్‌తో పలు ఉపయోగాలు
కొరిటెపాడు(గుంటూరు): ‘కపాస్ కిసాన్’ యాప్‌తో పత్తి రైతులకు పలు ఉపయోగాలున్నాయని, వెంటనే డౌన్‌లోడ్ చేసుకోవాలని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) జనరల్ మేనేజర్ రాజేంద్ర షా గురువారం ఒక ప్రకటనలో సూచించారు. 2025–26 పంట కాలంలో సీసీఐ మద్దతు ధర(ఎంఎస్‌పీ)తో పత్తి విక్రయాలకు ‘కపాస్ కిసాన్’ మొబైల్ యాప్‌లో నమోదుకావాలని ఆయన తెలిపారు. యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ ఐఓఎస్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని, మొబైల్ ఫోన్ నంబరుకు వచ్చే ఓటీపీ ద్వారా లాగిన్ కావాలని ఆయన సూచించారు. మద్దతు ధరకు విక్రయానికి యాప్‌లో స్లాట్ బుక్ చేసుకోవాలని తెలిపారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా పత్తి రైతుల ప్రయోజనాల కోసం, కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ) పథకం కింద ప్రయోజనాలను పొందడానికి తప్పనిసరిగా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని ఆయన తెలియజేశారు.
రైలులో గంజాయి పట్టివేత
తెనాలి రూరల్: రైలులో తరలిస్తున్న గంజాయిని తెనాలి జీఆర్పీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టాటా నగర్ నుంచి ఎర్నాకులం వెళ్లే రైలులో గంజాయి తరలిస్తున్నారన్న సమాచారంతో జీఆర్పీ ఎస్‌ఐ జి. వెంకటాద్రిబాబు, సిబ్బంది అప్రమత్తమయ్యారు. రైలు గురువారం తెనాలి చేరుకోగానే బోగీల్లో తనిఖీలు చేపట్టారు. ఎస్–3 బోగీలోని ఓ బ్యాగులో 4.4 కిలోల గంజాయిని గుర్తించి సీజ్ చేశారు. వెంటనే తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణకు సమాచారమందించి, ఆయన సమక్షంలో సీజ్ చేశారు. గంజాయి తరలిస్తున్న వ్యక్తి పరారయ్యాడని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.