
ఆపదలను కొని తెచ్చుకోవద్దు !
కలెక్టర్ వి. వినోద్ కుమార్ కృష్ణా నది తీర గ్రామాల్లో విస్తృత పర్యటన వరద తీవ్రత పెరిగితే పునరావాస కేంద్రాలకు తరలాలని ప్రజలకు సూచన ముంపు గ్రామాలలో నిత్యావసర సరకు నిల్వల పరిశీలన పునరావాస కేంద్రాల నిర్వహణపై అధికారులకు పలు సూచనలు
కొల్లూరు: కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రజలు వరద ప్రభావాన్ని తక్కువ అంచనా వేసి, ప్రాణాల మీదకు కొని తెచ్చుకోవద్దని కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ హెచ్చరించారు. నదికి వరద తీవ్రత పెరిగిన నేపథ్యంలో ముంపు గ్రామాలైన చిలుమూరులంక, సుగ్గునలంక, ఈపూరులంక, చింతర్లంక, పెదలంక, పెసర్లంక గ్రామాల్లో బుధవారం ఆయన పర్యటించారు. వరద తీవ్రతపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, స్థానిక రేషన్ దుకాణాలను పరిశీలించారు.
పునరావాస కేంద్రాల తనిఖీ
తొలుత కలెక్టర్ కొల్లూరులో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను తనిఖీ చేసి, అధికారులకు పలు సూచనలు చేశారు. నదికి వరద నీరు వస్తున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా వ్యవహరిస్తూ, ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలని ఆయన కోరారు. వరద అధికమయ్యే పక్షంలో సురక్షిత ప్రాంతాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు రావాలని తెలిపారు. తమ గ్రామాలకు ప్రమాదం ఉండదన్న భరోసా ప్రజలు వ్యక్తం చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ వరద ముప్పును తక్కువ అంచనా వేయడం సమంజసం కాదని సూచించారు. అకస్మాత్తుగా వరద ప్రవాహం అధికమమైతే ముంపు గ్రామాల్లో ప్రజల ప్రాణాలకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని, ముందుగానే అప్రమత్తమవ్వాలని ఆయన సూచించారు.
వైద్య, ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉండాలి
వరద ప్రభావానికి గురయ్యే లంక గ్రామాల్లోని ప్రజలకు అవసరమైన నిత్యావసర వస్తువులను తక్షణం అందుబాటులో ఉంచాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వైద్య, ఆరోగ్య సిబ్బంది అవసరమైన మందులతో అందుబాటులో ఉండాలని చెప్పారు.
పునరావాస కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలి
వరద బాధితుల కోసం ఏర్పాటు చేస్తున్న పునరావాస కేంద్రాల్లో సకల సౌకర్యాల కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ఒక్కో కేంద్రానికి మండలస్థాయి అధికారిని, వారికి మరొక అధికారిని సహాయకులుగా నియమించి వరద బాధితులకు సేవలందించేలా చూడాలని సూచించారు. పునరావాస కేంద్రాల్లో మంచినీరు, కరెంట్, టాయిలెట్ సౌకర్యాలు కల్పించాలని చెప్పారు. నిర్ణీత వేళల్లో ఆహారం అందించాలని, అందుకు అవసరమైన నిల్వల్ని తక్షణం పునరావాస కేంద్రాలకు చేర్చాలని సివిల్ సప్లైస్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో రేపల్లె ఆర్డీఓ రామలక్ష్మి, తహసీల్దార్ బి. వెంకటేశ్వర్లు, ఆర్‌సీ ఏఈ విజయరాజు, వివిధ శాఖల జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
లంక గ్రామాల్లో ప్రాణ నష్టం లేకుండా చూడాలి
బాపట్ల: కృష్ణా నది వరదల నేపథ్యంలో లంక గ్రామాల్లో మనుష్యులు, పశువులకు ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వి.వినోద్ కుమార్ మత్స్యశాఖ అధికారులకు సూచించారు. ఆయన బుధవారం కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫ్‌రెన్స్ హాలు నుంచి మత్స్యశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణానదిలో నీటి ఉద్ధృతి ఎక్కువగా ఉందని, ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక అమలులో ఉందని ఆయన తెలిపారు. రాబోయే రెండు రోజుల్లో రెండవ ప్రమాద హెచ్చరిక రాబోయే అవకాశం ఉందని పేర్కొన్నారు. వరద ముంపునకు గురయ్యే కొల్లూరు లాక్‌ల వద్ద నుంచి ఎనిమిది గ్రామాలు, దోనేపూడి చప్టా నుంచి మూడు గ్రామాలు, వెల్లటూరు నుంచి ఏడు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు, భోజన సదుపాయాలు, వైద్య సేవల కోసం 73 బోట్లను అందుబాటులో ఉంచాలని ఆయన మత్స్య శాఖ అధికారులకు సూచించారు.