కర్లపాలెం: పొన్నల కాలువ చప్టాపై వరద నీరు ఉన్నప్పుడు ప్రజలు రాకపోకలు కొనసాగించవద్దని తహసీల్దార్ షాకీర్ పాషా, ఎంపీడీవో శ్రీనివాసరావు ప్రజలకు సూచించారు. మండల పరిధిలోని తుమ్మలపల్లి, నర్రావారిపాలెం గ్రామాల మధ్యనున్న కాలువను ఎస్‌ఐ రవీంద్రతో కలసి బుధవారం వారు పరిశీలించారు. ఇటీవల కురిసిన వర్షాలకు వరద నీరు చప్టా పైకి రావడంతో స్థానికుల సమాచారం మేరకు అధికారులు పరిశీలించారు. చప్టాపైకి వరద నీరు వచ్చినప్పుడు స్థానిక అధికారులు అప్రమత్తంగా ఉండి రాకపోకలను నిలిపివేయాలని చెప్పారు.
గాయత్రీ దేవిగా బాలచాముండేశ్వరి దర్శనం
అమరావతి: ప్రముఖ శైవక్షేత్రం అమరావతి బాలచాముండిక సమేత అమరేశ్వరాలయంలో శ్రీ దేవీ శరన్నవరాత్య్రుత్సవాలలో భాగంగా బుధవారం బాలచాముండేశ్వరి అమ్మవారిని గాయత్రీదేవిగా అలంకరించారు. దసరా వేడుకల్లో మూడో రోజు సహస్ర కుంకుమార్చన, దేవీ ఖడ్గమాల, త్రిశల, లలితా సహస్రనామార్చన, శ్రీ చక్రార్చనతోపాటు గాయత్రీదేవికి సంధ్యా సమయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలోని జ్వాలాముఖి, మహిషాసురమర్దిని అమ్మవార్లకు కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి దేవాలయంలో అమ్మవారిని గాయత్రీదేవిగా అలంకరించి ప్రత్యేక కుంకుమార్చనలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పూజల్లో పాల్గొన్నారు.
పల్నాడు జిల్లా మత్స్యశాఖ అధికారిగా వెంకట్రావు
నరసరావుపేటరూరల్: జిల్లా మత్స్యశాఖ అధికారిగా ఐ.వెంకట్రావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా ఉద్యాన శాఖ అధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వెంకట్రావుకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఆదేశాలు జారీ చేశారు. గతంలో మత్స్యశాఖ జిల్లా అధికారిగా పనిచేసిన సంజీవరావుపై ఆరోపణలు రావడంతో ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ ఈనెల 11న అప్పటి జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుత కలెక్టర్ కృతికా శుక్లా ఆదేశాల మేరకు వెంకట్రావు అదనపు బాధ్యతలు స్వీకరించారు.
శింగరకొండ ఆలయ పాలక మండలి నియామకం
అద్దంకి రూరల్: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం నూతన పాల మండలిని నియమించారు. అధ్యక్షుడుగా చుండూరి మురళీ సుధాకరరావుతో పాటు సభ్యులుగా ఆకుల కోటేశ్వరరావు, బత్తుల చంద్రశేఖర్, నూతి లక్ష్మీ ప్రసాద్, మందా సునీత, ఏల్చూరి వెంకట నారాయణమ్మ, ధూళిపాళ్ల వెంకటరత్నం, గొర్రెపాటి పద్మజ, హరబోలు నాగమ్మ, దేవరపల్లి సురేష్‌బాబు, కొనంకి సుబ్బారావు నియమితులయ్యారు.

పొన్నల కాలువపై చప్టా పరిశీలన