
ఏఎన్‌యూ లా బోర్డు ఆఫ్ స్టడీస్ సభ్యునిగా నర్రా
నాదెండ్ల: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం లాబోర్డు ఆఫ్ స్టడీస్ (అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్) సభ్యునిగా సాతులూరు గ్రామానికి చెందిన హైకోర్టు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఈ మేరకు ఏఎన్‌యూ డిప్యూటీ రిజిస్ట్రార్ కె రంగారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన న్యాయశాస్త్రంలో డిగ్రీ, పోస్ట్‌గ్రాడ్యుయేషన్ విభాగంలో సిలబస్, ఇతర అంశాల నిర్ణయాలకుగాను తొమ్మిది మంది సభ్యులతో వైస్‌ఛాన్సలర్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఏర్పాటు చేశారు. ఈయన ఏఎన్‌యూ పూర్వవిద్యార్థుల సంఘం అధ్యక్షుడిగా, హైకోర్టు న్యాయవాదిగా, అఖిల భారత న్యాయవాదుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా ప్రస్తుతం సేవలందిస్తున్నారు. న్యాయ విద్యార్థులు, న్యాయవాదులకు తరచూ అనేక అంశాలపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈయన వద్ద శిక్షణ పొందిన అనేక మంది న్యాయమూర్తులుగా, పబ్లిక్ ప్రాసిక్యూటర్లుగా, ప్రభుత్వ విభాగాల్లో న్యాయసలహాదారులుగా సేవలందిస్తున్నారు. ఇప్పటికే ఏఎన్‌యూ న్యాయసలహాదారుగా వ్యవహరిస్తున్నారు.