
మిత్రుడిని హతమార్చిన నిందితుల అరెస్ట్
చిలకలూరిపేట: స్నేహితుడిని తలపై రాడ్‌తో కొట్టి, గొంతును తాడుతో బిగించి క్రూరంగా హత్య చేసిన ముగ్గురు నిందితులను చిలకలూరిపేట రూరల్ సర్కిల్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. చిలకలూరిపేట రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నరసరావుపేట డీఎస్పీ ఎం హనుమంతరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు జిల్లా పెదకాకానికి చెందిన తాడిబోయిన గోపి(32) గతంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేసేవాడు. అతను దక్షిణామూర్తి సేలిస్టియాన్ క్రియేషన్స్ బ్యానర్‌పై షార్ట్‌ఫిలింలు, మిషన్ మంగళాద్రి పేరుమీద వెబ్‌సిరీస్‌లు తీయడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే ఈ ఏడాది జూన్ 25వ తేదీన గుర్తుతెలియని మృతదేహం యడ్లపాడు సర్వీస్ రోడ్డు కాల్వలో కాలిపోతున్న స్థితిలో కనిపించింది. పోలీసుల విచారణలో అది తాడిబోయిన గోపిదిగా గుర్తించారు. చనిపోయిన గోపికి గుంటూరుకు చెందిన ఆఫ్రిన్ అనే ఆమె ద్వారా వాళ్ల తమ్ముడు, గుంటూరులోని సుద్దపల్లిడొంకలో నివాసం ఉండే షేక్ ఇమ్రాన్ పరిచయమయ్యారు. కొంతకాలానికి గోపి, ఇమ్రాన్‌ల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో గోపిని హత్యచేయాలని నిర్ణయించుకున్నాడు. ఇమ్రాన్‌కు స్నేహితులైన గుంటూరు రామిరెడ్డిపేటకు చెందిన షేక్ రియాజ్, నల్లచెరువు ప్రాంతానికి చెందిన షేక్ ఖాజామొహిద్దీన్‌లను కలుపుకొని పథకం ప్రకారం గుంటూరులోని ఎంప్లాయీస్ కాలనీలో ఉన్న ఇమ్రాన్ అద్దె గదికి గోపిని జూన్ 24న ఫోన్ చేసి రప్పించారు. ముగ్గురు కలసి ఇనుపరాడ్డుతో గోపి తలపై కొట్టి ఆపై తాడుతో మెడకు ఉరివేసి హత్యచేశారు. మృతుడు గోపికి చెందిన కారు డిక్కీలో శవాన్ని చిలకలూరిపేటకు తీసుకువచ్చి ఇక్కడ పెట్రోల్ బంకులో రెండు లీటర్ల పెట్రోల్ కొనుగోలు చేసి గుంటూరు రోడ్డులో తిమ్మాపురం దాటిన తర్వాత యడ్లపాడు సమీపంలో సర్వీస్ రోడ్డు పక్కన సిమెంట్ కాల్వలో గోపీ మృతదేహాన్ని వేసి పెట్రోలు పోసి తగలబెట్టి పరారయ్యారు. యడ్లపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి గోపికి చెందిన కారు, కీ పాడ్ ఫోన్, సెల్‌ఫోన్, ఏటీఎం కార్డులు, రూ.12వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసులో చాకచక్యంగా వ్యవహరించిన చిలకలూరిపేట రూరల్ సీఐ బి సుబ్బానాయుడు, యడ్లపాడు ఎస్‌ఐ టి శివరామకృష్ణ, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.