
108 వాహనం, బైక్ ఢీ : ఒకరు మృతి
మరొకరి పరిస్థితి విషమం ముళ్ల పొదల్లోకి దూసుకుపోయిన 108 వాహనం
కొల్లూరు : జోరు వానలో ఎదురెదురుగా వస్తున్న వాహనాలు ఢీకొని ఓ యువకుడు మృతి చెందగా, మరో యువకుడు తీవ్ర గాయాల బారినపడిన సంఘటన కొల్లూరు సమీపంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. ఆదివారం నిజాంపట్నానికి చెందిన 108 వాహనంలో రేపల్లె వైద్యశాల నుంచి తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు రోగులను తరలిస్తున్నారు. వేమూరు వైపు నుంచి ద్విచక్ర వాహనంపై కొల్లూరుకు ముగ్గురు యువకులు వస్తున్నారు. స్థానిక స్థానిక అయ్యప్ప స్వామి ఆలయం సమీపంలో రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న షేక్ నరేష్, పాలపర్తి కోటేశ్వరరావు తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరినీ హుటాహుటిన కొల్లూరు ఎస్‌ఐ, స్థానికులు తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. తీవ్రంగా గాయపడిన నరేష్ పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. కోటేశ్వరరావు పరిస్థితి కూడా విషమంగా ఉంది. ప్రమాద సమయంలో ద్విచక్ర వాహనం పైనే ఉన్న మరో యువకుడు అక్షయ్ అభిజిత్ స్వల్ప గాయాలతో తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాదం కారణంగా 108 వాహనం అదుపుకోల్పోయి రోడ్డు పక్కనున్న ముళ్ల పొదల్లోకి దూసుకుపోయింది. డ్రైవర్ ముద్రబోయిన సుబ్బారావు పంట కాలువలోకి వాహనం పల్టీ కొట్టకుండా నిలువరించగలగడంతో రేపల్లె నుంచి తరలిస్తున్న రోగులు సురక్షితంగా ప్రమాదం నుంచి బయట పడగలిగారు. డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని కొల్లూరు పోలీసు స్టేషన్‌కు తరలించారు. రోగులను మరో 108 వాహనంలో పోలీసులు తెనాలి వైద్యశాలకు తరలించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరపనున్నట్లు ఎస్‌ఐ జానకీ అమరవర్ధన్ తెలిపారు.