
25న విజయవాడలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ బాఽధితుల రక్షణపై ధ
లక్ష్మీపురం: దళితులపై దాడులు, అత్యాచారాలు ఆగాలంటే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని, లేకుంటే బాధితులకు న్యాయం జరగదని కుల వివక్ష వ్యతిరేక సంఘం(కేవీపీఎస్) రాష్ట్ర కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి అన్నారు. దళితులు, బహుజనులపై జరుగుతున్న అత్యాచారాలు, అట్రాసిటీ ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం, పోలీస్ వ్యవస్థ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ గుంటూరు బ్రాడీపేటలోని పీఎల్ రావు భవన్‌లోని కేవీపీఎస్ జిల్లా కార్యాలయంలో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. మాల్యాద్రి మాట్లాడుతూ దళితులపై అణచివేత కొనసాగుతున్న పరిస్థితుల్లో బహుజన సమాజం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. బాధితులు ఎన్ని ఫిర్యాదులు చేసినా పోలీసులు వెంటనే కేసులు నమోదు చేయకపోవడం, ఆలస్యం చేయ డం, లేదా ఎఫ్‌ఐఆర్‌లు బలహీనంగా నమోదు చేయడం వల్ల న్యాయం జరగడం లేదని అన్నారు. డీహెచ్‌పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కరవది సుబ్బారావు మాట్లాడుతూ బాధితుల పక్షాన నిలబడే మానవ హక్కుల సంఘాలు, ప్రజాసంఘాలను ప్రభుత్వం అడ్డుకోవడం మానుకోవాలన్నారు. న్యాయవాది శిఖా సురేష్ మాట్లాడుతూ కేసులను తేలికగా తీసుకుంటే న్యాయ వ్యవస్థపై ప్రజల నమ్మకం దెబ్బతింటుందన్నారు. నేరస్తులను కఠినంగా శిక్షించడమే సమాజంలో మార్పు తీసుకొస్తుందన్నారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బి. లక్ష్మణరావు మాట్లాడుతూ దళితులు గిరిజనుల మీద జరుగుతున్న దాడులకు నిరసనగా అన్ని దళిత గిరిజన సంఘాలతో పాటు వర్గ సంఘాలు కూడా తోడై ఐక్యంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. సెప్టెంబర్ 25న విజయవాడలో జరగబోయే ధర్నాలో పాల్గొని ప్రభుత్వాన్ని కదిలించేలా పోరాటం చేస్తామని తీర్మానం చేశారు. కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.