
కృష్ణా నదిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం
కొల్లూరు : కృష్ణా నదీ వరద ప్రవాహంలో గుర్తు తెలియని ఓ వ్యక్తి మృతదేహం కొట్టుకొచ్చి, నది అంచుల వద్ద పొదల్లో తేలింది. ఆదివారం ఉదయం మండలంలోని ఈపూరులంకలో పంట పొలాల వద్దకు వెళ్లిన రైతులు నది ఒడ్డు వెంబడి 60 సంవత్సరాల వరకు ఉన్న ఓ పురుషుడి మృతదేహం తేలి ఉండటాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో రెవెన్యూ సిబ్బందితో కలసి అక్కడకు వెళ్లారు. రెండు రోజుల కిందట విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద నదిలోకి దూకి గల్లంతైన వ్యక్తి మృతదేహం అయి ఉండవచ్చన్న అనుమానంతో కొల్లూరు పోలీసులు తాడేపల్లి, విజయవాడ పోలీసులకు సమాచారం అందించారు. అయితే, మృతదేహం విజయవాడ వద్ద నదిలో దూకిన వ్యక్తిది కాదని అతని బంధువులు నిర్ధారించారు. నది ఒడ్డున పొదల్లో ఆచూకీ కోసం పోలీసులు ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లభించలేదు. బట్టతలతో, లేత గోధుమ రంగు చొక్కా, బ్లూ ప్యాంట్ ధరించి, చేతికి ఎర్రని దారంతో ఆంజనేయ స్వామి లాకెట్ కట్టి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి పోస్టుమార్టం అనంతరం శవాగారంలో భద్రపరచనున్నట్లు ఎస్‌ఐ జానకీ అమర్‌వర్ధన్ తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహంగా కేసు నమోదు చేసి దర్యాప్తు జరపనున్నట్లు చెప్పారు.