
సంక్షోభంలో పారిశ్రామిక రంగం
మార్టూరు: ఇటీవల భారత్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధిస్తున్న సుంకాలతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లోప భూయిష్ట విధానాల వల్ల పారిశ్రామిక రంగం సంక్షోభం అంచున ఉందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు డి. రమాదేవి అన్నారు. మార్టూరు సీఐటీయూ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. నూలు మిల్లుల నిర్వహణ భారం పెరిగి మార్టూరు, చిలకలూరిపేట ప్రాంతాల నూలు మిల్లుల యాజమాన్యాలు మూసివేత దిశగా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. గ్రానైట్ యజమానులకు రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల రాయితీలను విడుదల చేసి విద్యుత్ చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు. గ్రానైట్ క్వారీలు పరిశ్రమల్లో ఇటీవల ప్రమాదాల బారిన పడి వలస కార్మికులు మృత్యువాత పడుతున్నారని అందుకు అధికారుల అలసత్వం, నిర్లక్ష్య వైఖరే కారణాలని ఆమె ఆరోపించారు. రైతులకు సకాలంలో ఎరువులను అందించలేని రాష్ట్ర ప్రభుత్వం వీధి వీధినా బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని ఆరోపించారు. బాపట్ల సీపీఎం కార్యదర్శి సీహెచ్ గంగయ్య, మార్టూరు నాయకులు బత్తుల హనుమంతరావు, ఎనిక పాటి రాంబాబు, బి.సూరిబాబు పాల్గొన్నారు.
సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు రమాదేవి