
పర్యావరణ పరిరక్షణే లక్ష్యం
జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్
పర్చూరు(చినగంజాం): పర్యావరణ పరిరక్షణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. పర్చూరులోని బీఏఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం నిర్వహించిన స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కళాశాలలో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుతో కలిసి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. కళాశాల నుంచి జెడ్పీ హైస్కూల్ వరకు పాఠశాల, కళాశాల విద్యార్థులు, జిల్లా అధికారులతో నిర్వహించిన ర్యాలీని ప్రారంభించారు. అనంతరం బొమ్మల సెంటర్ వద్ద మానవహారం నిర్వహించి పరిసరాల పరిశుభ్రతపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ గ్రీన్ ఆంధ్రప్రదేశ్ సాధించాలనే సంకల్పంతో పర్చూరు నియోజక వర్గంలో కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. పర్చూరులో పంచాయతీ కార్మికులతో కలెక్టర్ వినోద్ కుమార్ కాఫీ విత్ క్లాప్ మిత్ర నిర్వహించారు. అదేవిధంగా పర్చూరు మార్కెట్ యార్డు ఆవరణలో నిర్వహిస్తున్న నల్లబర్లీ పొగాకు కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ వినోద్‌కుమార్ సందర్శించి పరిశీలించారు. గోడౌన్ సౌకర్యం లేకపోవడంతో పూర్తిస్థాయిలో కొనుగోళ్లు జరపలేకపోతున్నామని అధికారులు తెలపడంతో సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లి తక్షణం చర్యలు తీసుకునేలా కృషి చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఆర్డీఓ గ్లోరియా, డీపీఓ ప్రభాకరరావు, నియోజక వర్గ ప్రత్యేకాధికారి ఎస్.లవన్న, మార్కెటింగ్ డీఎం కరుణశ్రీ, వ్యవసాయ శాఖాధికారి అన్నపూర్ణ, మార్కెటింగ్ ఏడీ రమేష్ బాబు, డ్వామా పీడీ విజయలక్ష్మి, అధికారులు, వ్యవసాయ శాఖ ప్రతినిధులు, మార్కెట్ కమిటీ చైర్మన్ గుంజి వెంకటరావు పాల్గొన్నారు.
జిల్లాలో పుష్కలంగా యూరియా..
బాపట్ల: జిల్లాలో యూరియా పుష్కలంగా ఉందని రైతులు సంతోషంగా యూరియా తీసుకొనివెళ్లవచ్చని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం బాపట్ల జిల్లాలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఆర్‌ఎస్‌కేలు, పీఏసీఎస్ కేంద్రాల ద్వారా 112 మెట్రిక్ టన్నుల యూరియాను 978 మంది రైతులకు పంపిణీ చేయడం జరిగిందని, ఇంకా 114 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.