
రైల్వే ప్రాంగణాల పరిశుభ్రత సమష్టి బాధ్యత
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్) : స్వచ్ఛ భారత్ దార్శనికతకు అనుగుణంగా రైల్వే ప్రాంగణాలను, పరిసరాలను శుభ్రంగా, ఆహ్లాదకరంగా ఉంచడంలో సమష్టి బాధ్యత వహించాలని గుంటూరు రైల్వే డివిజనల్ డీఆర్‌ఎం సుథేష్ఠ సేన్ పిలుపు నిచ్చారు. పట్టాభిపురంలోని డీఆర్‌ఎం కార్యాలం నుంచి గుంటూరు రైల్వే స్టేషన్ వరకు స్వచ్ఛతా హి సేవ –2025 కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. డివిజన్ అధికారులు, సిబ్బంది, స్కౌట్స్ అండ్ గైడ్స్, వలంటీర్లతో కలిసి డీఆర్‌ఎం ప్రారంభించారు. ర్యాలీలో సిబ్బంది, అధికారులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని ప్రతి రైల్వే స్టేషన్, కార్యాలయాల ప్రాంగణంలో ఆకు పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణంలో విధులు నిర్వహించడం వల్ల మానసిక సంతృప్తి దక్కుతుందని తెలిపారు. పచ్చని చెట్లు చుట్టు ఉన్న ప్రాంగణాల్లోకి కలుషితమైన గాలి రాదని తెలిపారు. అనంతరం ర్యాలీని విజయవంతంగా రైల్వే స్టేషన్ వరకు నిర్వహించారు. కార్యక్రమంలో డీఆర్‌ఎం కార్యాలయ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.
డీఆర్‌ఎం సుథేష్ఠ సేన్