
కూటమి కుట్రలపై ఎగసిన నిరసన
కూటమి సర్కార్ కుటిల యత్నాలపై వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆగ్రహం
ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నిరసన ర్యాలీ
బాపట్లలో ‘చలో మెడికల్ కాలేజీ’ కార్యక్రమానికి విశేష స్పందన
ఎక్కడికక్కడ అడ్డుకోవడానికి పోలీసుల ద్వారా కూటమి పాలకుల యత్నాలు
అడ్డంకులను ఛేదించుకుని మరీ భారీగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు
మద్దతుగా పోటెత్తిన విద్యార్థులు, యువత, అనుబంధ విభాగాల ప్రతినిధులు
వైద్య విద్య పేదలకు దూరం చేసే ప్రయత్నాలను ప్రభుత్వం విడనాడాలి
పేద, మధ్యతరగతి వర్గాలకు ఉచిత వైద్య సేవలను దూరం చేయొద్దు
వైఎస్ జగన్ సంకల్పించిన వైద్య కళాశాల నిర్మాణం పూర్తి చేయాలని నేతల డిమాండ్
ప్రభుత్వ వైద్యవిద్యను అంగడి సరుకుగా అమ్మేందుకు కూటమి సర్కార్ కుట్ర
వైఎస్సార్‌సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షులు మేరుగ నాగార్జున ధ్వజం
ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై వైఎస్సార్‌సీపీ ’చలో మెడికల్ కాలేజీ’ విజయవంతం
బాపట్ల టౌన్: ప్రభుత్వ వైద్యవిద్యను అంగడి సరుకుగా అమ్మేందుకు కూటమి సర్కార్ ప్రయత్నిస్తోందని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మేరుగ నాగార్జున తెలిపారు. పార్టీ పిలుపు మేరకు శుక్రవారం బాపట్లలో ‘చలో మెడికల్ కాలేజీ’ కార్యక్రమాన్ని యువజన విభాగం ఆధ్వర్యంలో నిర్వహించారు. తొలుత పట్టణంలోని పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ గడియారస్తంభం, అంబేడ్కర్ సర్కిల్, జమ్ములపాలెం రైల్వే ఓవర్‌బ్రిడ్జి మీదుగా మెడికల్ కళాశాల వరకు సాగింది. జిల్లాలోని వేమూరు, రేపల్లె, బాపట్ల, చీరాల, అద్దంకి, పర్చూరు నియోజకవర్గాల నుంచి ఆయా నియోజకవర్గాల సమన్వయకర్తల ఆధ్వర్యంలో యువజన విభాగం నాయకులు, కార్యకర్తలు భారీసంఖ్యలో చేరుకున్నారు. ర్యాలీలో ‘అన్నీ ప్రైవేటీకరణ చేస్తే ప్రభుత్వం ఎందుకు’, ‘ప్రతి జిల్లాలో ఓ మెడికల్ కళాశాల జగన్ ఆశయం’, ‘ప్రతి బినామీకి ఓ మెడికల్ కళాశాల చంద్రబాబు ఆశయం’, ‘పేద విద్యార్థులకు వైద్య విద్య జగన్ సంకల్పం’, తన వర్గానికే వైద్యవిద్య బాబు సంకల్పం’ అంటూ నినాదాలు చేశారు.
ర్యాలీ అనంతరం మెడికల్ కళాశాల వద్ద విలేకరులతో మేరుగ నాగార్జున మాట్లాడుతూ... పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికోసం వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయాలని సంకల్పించారన్నారు. వాటిని పీపీపీ పేరుతో ప్రైవేటుపరం చేసేందుకు నేడు చంద్రబాబు ప్రయత్నించడం సిగ్గు చేటన్నారు. నీతి, నిజాయతీ లేకుండా అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేసి... వాటిల్లో 7 పూర్తి చేసి, 2 మెడికల్ కళాశాలలకు సీట్లు కూడా కేటాయిస్తే వాటిని వెనక్కి పంపించిన ఘనుడు చంద్రబాబు అన్నారు.
అసలు మెడికల్ కళాశాలలే ఏర్పాటు చేయలేదు... పునాదులే వేయలేదని హోంమంత్రి మాట్లాడటం దారుణమని మేరుగ పేర్కొన్నారు. ధైర్యం ఉంటే మీడియా సాక్షిగా రాష్ట్రంలోని ఏ మెడికల్ కళాశాల వద్దకై నా కూటమి నాయకులు చర్చకు రావాలని, తాము సిద్ధంగా ఉన్నామన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పేద, బడుగు, బలహీన వర్గాలపై అక్కసుతోనే పాలన సాగిస్తోందని చెప్పారు. నిధుల కొరతను సాకుగా వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేసే కుట్రకు తెరతీశారన్నారు. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్తలు వరికూటి అశోక్‌బాబు (వేమూరు), ఈవూరి గణేష్ (రేపల్లె), కరణం వెంకటేష్ (చీరాల), చింతలపూడి అశోక్‌కుమార్ (అద్దంకి), గాదె మధుసూదన్‌రెడ్డి (పర్చూరు), యువజన విభాగ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మేరుగ చందక్‌నాగ్, జిల్లా అధ్యక్షుడు కొక్కిలిగడ్డ చెంచయ్య, విద్యార్ధి విభాగం జిల్లా అధ్యక్షుడు యల్లావుల సోహిత్, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కోకి రాఘవరెడ్డి, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు పాల్గొన్నారు.

కూటమి కుట్రలపై ఎగసిన నిరసన