
నేడు మాచర్లలో సీఎం పర్యటన
మాచర్లరూరల్:‘స్వర్ణాంధ్ర– స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా మాచర్ల పట్టణానికి సీఎం చంద్రబాబు శనివారం రానున్నారు. ఆయన ఉదయం 10.30 గంటలకు సాగర్ రోడ్డులోని సెయింట్ ఆన్స్ ఇంగ్లిషు మీడియం స్కూల్‌లో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. 10.45 నుంచి 11.05 గంటల వరకు 23వ వార్డు యాదవ బజారులో నిర్వహించే ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో పాల్గొంటారు. 11.10 నుంచి 11.28 గంటల వరకు ఆర్టీసీ గ్యారేజీ వద్ద సఫాయి కార్మికులు, మెడికల్ సిబ్బందితో కలిసి మాటామంతీ కార్యక్రమంలో పాల్గొంటారు. స్వచ్ఛత రథాన్ని జెండా ఊపి ప్రారంభిస్తారు. అనంతరం ప్రజా వేదిక వద్ద స్టాళ్లను సందర్శించి, వేదికపై నుంచి ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు ఆటోనగర్ వద్ద పార్టీ కార్యకర్తలతో సమావేశం కానున్నారు. తర్వాత యాదవుల బజారులో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఎస్పీ కృష్ణారావు తదితరులు శుక్రవారం సీఎం పర్యటించే ప్రాంతాలలో ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులకు తగు సూచనలు చేశారు.
నేడు కోర్టు ప్రాంగణంలో సమావేశం
నరసరావుపేట టౌన్: మండల న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చైల్డ్ ఫ్రెండ్లీ లీగల్ సర్వీస్ ఫర్ చిల్డ్రన్ పథకంపై శనివారం సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రధాన సివిల్ జడ్జి కె.మధుస్వామి శుక్రవారం తెలిపారు. విద్య, ఆరోగ్య, మహిళాశిశు సంక్షేమం,పంచాయతీ రాజ్, కార్మిక సంక్షేమ శాఖల అధికారులతో 13వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఆదేశాల మేరకు కోర్టు ప్రాంగణంలో ఈ సమావేశం జరగనుందని పేర్కొన్నారు.
రాహుకేతు పూజలకు ప్రత్యేక ఏర్పాట్లు
పెదకాకాని: శివాలయంలో రాహుకేతు గ్రహ పూజలకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్ జీవీడీఎల్ లీలాకుమార్ తెలిపారు. పెదకాకాని శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానంలో ఈ నెల 21వ తేదీన మహాలయ అమావాస్య ఆదివారం కావడంతో ఈ పూజలు చేయించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని శుక్రవారం ఆయన పేర్కొన్నారు. రద్దీని దృష్టిలో పెట్టుకుని రాహుకేతు పూజా మండపం వద్ద షామియానాలు, క్యూలైన్‌లు, తాగునీరు వంటి సౌకర్యాలు కల్పించినట్లు చెప్పారు. ఆదివారం తెల్లవారుజామున 4 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకూ జరిగే పూజలకు ప్రధాన కౌంటర్‌లో టిక్కెట్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
సుప్రీంకోర్టులోనూ ఉచిత న్యాయ సహాయం
13వ అదనపు జిల్లా న్యాయమూర్తి డాక్టర్ ఎన్. సత్యశ్రీ
నరసరావుపేట టౌన్: మధ్య ఆదాయ వర్గాల వారికి సుప్రీంకోర్టులో ఉచిత న్యాయ సహాయం అందించనున్నట్లు మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, 13వ అదనపు జిల్లా న్యాయమూర్తి డాక్టర్ ఎన్. సత్యశ్రీ శుక్రవారం తెలిపారు. సుప్రీంకోర్టులో ఉన్న మిడిల్ ఇన్‌కమ్ గ్రూప్ లీగల్ ఎయిడ్ సొసైటీ ద్వారా సహాయం అందించనున్నట్లు పేర్కొన్నారు. సంవత్సరానికి రూ. 12 లక్షలలోపు ఆదాయం ఉన్నవారు దీనికి అర్హులని వివరించారు. ఈ అవకాశాన్ని అవసరమైన వారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ
మంగళగిరిటౌన్: మంగళగిరి పట్టణ పరిధిలోని శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి వారి సన్నిధిలో ఈ నెల 22వ తేదీ నుంచి జరగనున్న శ్రీదేవి శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాల శుభ ఆహ్వానపత్రికను దేవస్థానంలో శుక్ర వారం ఆవిష్కరించారు. ఆలయ అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

నేడు మాచర్లలో సీఎం పర్యటన