
ఎంపీడీవోలుగా ఉద్యోగోన్నతి
గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో ఉద్యోగోన్నతిపై ఎంపీడీవోలుగా నియమితులైన అధికారులకు జెడ్పీ చైర్‌పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా నియామక ఉత్తర్వులను అందజేశారు. గురువారం జెడ్పీ క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో పని చేస్తున్న నలుగురు ఏవోలు, ఆరుగురు డిప్యూటీ ఎంపీడీవోలకు ఎంపీడీవోలుగా ఉద్యోగోన్నతి కల్పిస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ విడుదల చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా నియామకపత్రాలను అందజేశారు. నూతన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు. ప్రజలకు తమవంతు సేవ చేయడానికి అన్ని విధాలుగా కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు, డిప్యూటీ సీఈవో సీహెచ్ కృష్ణ, అకౌంట్స్ అధికారి శామ్యూల్ పాల్, జీ సెక్షన్ ఏవో పూర్ణచంద్రారెడ్డి, మోహన్‌రావు పాల్గొన్నారు.