
కూటమి వైఫల్యాలపై పోరుబాట
రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఈవూరు గణేష్ 19న బాపట్ల మెడికల్ కళాశాల వద్ద నిరసనకు తరలిరావాలని పిలుపు
చెరుకుపల్లి: ప్రైవేటీకరణ పేరుతో జాతీయ సంపదలైన వైద్య కళాశాలలతో రాష్ట్రంలో కూటమి నేతలు దోపిడీకి పాల్పడుతున్నారని వైఎస్సార్‌సీపీ రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఈవూరి గణేష్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నియోజకవర్గంలోని పార్టీ మండల కన్వీనర్లు, యువజన, విద్యార్థి విభాగ ప్రతినిధులు, పార్టీ నాయకులతో బుధవారం గుళ్ళపల్లిలోని తన కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... మెడికల్ కాలేజీలపై కూటమి ప్రభుత్వ నాయకులు చేస్తున్న విష ప్రచారాన్ని ఎండగట్టేందుకు పార్టీ అధినాయకత్వం ఆదేశాల మేరకు ఈ నెల 19వ తేదీన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు బాపట్ల మెడికల్ కళాశాల వద్ద నిరసన కార్యక్రమానికి తరలిరావాలన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలని పిలుపునిచ్చారు. పేద విద్యార్థులకు వైద్య విద్య అందాలనే దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కేంద్రాన్ని ఒప్పించి రూ.వేల కోట్లతో 17 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారన్నారు. వాటిలో ఐదు కళాశాలలు శరవేగంగా నిర్మాణాలు పూర్తి చేసుకున్నాయని, వాటిలో తరగతులు కూడా జరుగుతున్నట్లు వివరించారు. మిగిలిన కళాశాలల నిర్మాణం కూడా వివిధ దశల్లో ఉన్నట్లు గుర్తుచేశారు.
నిర్మాణాలను పట్టించుకోని ప్రభుత్వం
కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి ఆ కాలేజీలను పూర్తి చేయకుండా పీపీపీ పేరుతో ప్రయివేటు వ్యక్తులకు అప్పగించేందుకు కుట్రలు చేయటం దుర్మార్గమన్నారు. ఇప్పటికై నా మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వెఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన విభాగం అధికార ప్రతినిధి నీలం వీరేంద్ర, జిల్లా యువజన విభాగం కార్యదర్శి బడుగు ప్రజన్న తేజ, రేపల్లె నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు దొంతిబోయిన ఏడుకొండలు రెడ్డి, రేపల్లె నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షుడు ఎండీ వశీం, చెరుకుపల్లి మండల యువజన విభాగ అధ్యక్షుడు తుమ్మా రామకృష్ణారెడ్డి, చెరుకుపల్లి మండల కన్వీనర్ దుండి వెంకట రామిరెడ్డి, నగరం మండల కన్వీనర్ ఇంకొల్లు రామకృష్ణ, దగ్గుమల్లి పృథ్వీరాజ్ పాల్గొన్నారు.